ఓ సినిమా మొదలైన పుష్ప.. చివరికి రెండు భాగాలుగా అయిపోయింది. పార్ట్ 1 గత డిసెంబరులో విడుదలై.. సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2కి సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని కూనూర్‌లో.. కథా చర్చలు మొదలవ్వబోతున్నాయి. సుకుమార్‌తో పాటుగా తన సహాయ దర్శకులు, కొంతమంది కీలకమైన సాంకేతిక నిపుణులు కూనూర్‌లో వెళ్తున్నారు. ఎండలు కాస్త తగ్గాక, అంటే జూన్, జులైలో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టాలని చూస్తున్నారు.
అయితే సుకుమార్ ఇప్పుడు ఓ కొత్త ట్విస్టు ఇవ్వబోతున్నట్టు టాక్. ఈ కథ రెండు భాగాలతోనే ఆపేయడం లేదు. మూడో భాగంకి కూడా ఓ హింట్ ఇవ్వబోతున్నాడట. క్లైమాక్స్ లో పుష్ప 3కి సంబంధించిన లీడ్ ఒకటి ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కాకపోతే.. పుష్ప 2కీ, పుష్ప 3కీ మధ్య చాలా గ్యాప్ ఉంటుందట. ఈలోగా సుకుమార్ ఓ సినిమా, బన్నీ మరో సినిమా చేసుకొస్తారు. ఆ తరవాతే పుష్ప 3 ఉంటుంది. అయితే దీనికీ కండిషన్లు అప్లై అవుతాయి. పుష్ప 2 అనుకున్నట్టుగా బాగా వస్తేనే పార్ట్ 3 ఉంటుంది. లేదంటే.. లేదు. అదీ ప్రస్తుతానికి సుకుమార్ లెక్క.