సుకుమార్ అంటే దేవిశ్రీ.. దేవిశ్రీ అంటే సుకుమార్. `నేను శరీరం అయితే.. దేవీ నా ఆత్మ` అని సుకుమార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. వాళ్ల బంధం అలాంటిది. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక మీదటా చేయడు కూడా. `సుకుమార్ రైటింగ్స్`పై సుకుమార్ చిన్న సినిమాలు తీసినప్పుడు కూడా దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నాడు. దేవి కూడా చిన్న సినిమా – పెద్ద సినిమా అనే తేడా లేకుండా `కుమారి 21 ఎఫ్`కి అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. సుకుమార్ రైటింగ్స్ లో ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా మొదలైంది. కార్తీక్ దర్శకుడు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే.. అన్నీ సుకుమారే అందించాడు. అయితే.. ఈ సినిమాకి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టాడు సుకుమార్. `కాంతార` సంగీత దర్శకుడు అంజనీష్ లోక్‌నాథ్‌ని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. సుకుమార్ టీమ్ లో.. దేవిశ్రీ లేకపోవడం ఇదే తొలిసారి.
నిజానికి.. ఈ సినిమాకి కూడా దేవిశ్రీనే ఎంచుకొన్నారు. అయితే… దేవి ఏకంగా రూ.4 కోట్ల పారితోషికం అడిగాడని టాక్. అడిగినంత ఇవ్వడానికి కూడా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సిద్ధమయ్యాడు. కాకపోతే.. బడ్జెట్ కంట్రోల్ లో ఉంచాలని సుకుమార్ రంగంలో దిగి… అంజనీష్ని ఎంచుకొన్నాడని సమాచారం. సాయిధరమ్ హిట్ కొట్టి చాలాకాలమైంది. తన మార్కెట్ కొంచెం డల్ గా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే బడ్జెట్ లో `కోత` మొదలుపెట్టాడట సుకుమార్. దేవిశ్రీని తప్పించి మరో సంగీత దర్శకుడ్ని ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. మరి.. దేవిశ్రీ ప్రసాద్ లేని సుకుమార్ సినిమాలోని పాటలు ఎలా ఉంటాయో చూడాలి.