దర్శకుడిగా సుకుమార్ కమర్షియల్ స్టామినా తెలియజేసిన సినిమా ‘రంగస్థలం’. అంతకు ముందు ఆయన ఖాతాలో విజయాలు లేవని కాదు. దర్శకుడిగా సుకుమార్ ప్రతిభను తక్కువ చేయడమూ లేదు. రంగస్థలానికి ముందు సుకుమార్‌ని మేథావి దర్శకుడిగా ఎక్కువమంది పరిగణించేవారు. ఈ లెక్కల మాస్టారు లాజిక్కులు స్క్రీన్‌ప్లే లాజిక్కులు సామాన్యులకు అర్థం కావనే విమర్శ వినిపించేది. ‘రంగస్థలం’తో ఫక్తు కమర్షియల్ సినిమాలూ తీయగలడని పేరొచ్చింది. దాంతో సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాలనే నిర్మాతల సంఖ్య మరింత పెరిగింది. అందులో ప్రముఖ హిందీ నిర్మాత సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ కూడా వుంది.
‘రంగస్థలం’ తరవాత తన తదుపరి సినిమాను కూడా ఆ సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో సుకుమార్ చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అందులో హీరో. మహేష్ సినిమా తరవాత ఈరోస్ సంస్థలో సుకుమార్ హిందీ సినిమా చేసే ఛాన్స్ వుంది. దీనికి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందించారు. “ఈరోస్‌తో సుకుమార్ సినిమా చేయనున్న మాట నిజమే. అదే సంస్థకు నేను పది కథలు అందిస్తున్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పది కథలతో సినిమాలు చేస్తారు. ఈ పది సినిమాల్లో సుకుమార్ సినిమా లేదు. అది వేరే సినిమా” అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మొత్తం మీద ఆయన ఈరోస్ సంస్థలో సుకుమార్ సినిమా చేయనున్నారని కన్ఫర్మ్ చేశారు.
మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. విడుదలకు ముందు ఈరోస్ సంస్థ సినిమాను కొనేసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసింది. ఇప్పుడు సుకుమార్‌తో మరోసారి చేతులు కలపడానికి ముందుకొచ్చింది. ఈరోజు విడుదల కానున్న ‘సాక్ష్యం’ సినిమానూ ఈరోస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సంస్థ తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి సుముఖంగా వుంది.