సినిమా అంటే 24 విభాగాల సమష్టి కృషి. తెర ముందు కనిపించేది కొంతమందే. వెనుక అహర్నిశలూ శ్రమించేది ఎంతమందో. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా.. వాళ్ల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటారు తప్ప – సెట్లో చెమటోడ్చిన వాళ్లని ప్రస్తావించరు. కానీ సుకుమార్ మాత్రం ఈ పని చేశాడు. పుష్ప విజయోత్సవ సభ… తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా సుకుమార్ దాదాపు పావుగంట మాట్లాడాడు. ఈ స్సీచులో బన్నీ గురించో, దేవి శ్రీ ప్రసాద్ గురించో, తన గురించో, నిర్మాతల గురించో కాదు. కేవలం తన టీమ్ గురించి. తన సహాయ దర్శకులు, రచయితల బృందం గురించి. వేదికపై దాదాపు 15 మందిని తోడ్కుని వచ్చిన సుకుమార్ – పేరు పేరునా.. ఒకొక్కరి గురించీ, వాళ్ల ప్రతిభ గురించీ.. సవివరంగా వివరించి, తనకు వాళ్లెంత బలాన్ని ఇచ్చారో పూస గుచ్చినట్టు చెప్పాడు. ఓ వైపు అభిమానులు `బన్నీ బన్నీ` అంటూ అరుస్తున్నా సరే.. `నా టీమ్ గురించి నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు? వాళ్లే నా బలం.. వాళ్లు లేకపోతే నేను లేను` అంటూ… పేరు పేరునా.. ఒకొక్కరినీ ప్రస్తావిస్తూ వాళ్ల గురించి అనర్గళంగా మాట్లాడాడు. తనకు వాళ్లెంత చేశారో చెప్పుకొచ్చాడు. సహాయ దర్శకులకు సుకుమార్ ఇచ్చే విలువ వేరని.. ఇండ్రస్ట్రీలో అంతా చెప్పుకుంటూ ఉంటారు. అదెలా ఉంటుందో.. ఈరోజు ఈ స్టేజీపై తెలిసొచ్చింది. నిజంగా ఈ విషయంలో సుకుమార్ ని అభినందించి తీరాల్సిందే. వెల్ డన్ సుకుమార్.