‘రంగమ్మా… మంగమ్మా’ పాట వివాదంపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. రామ్ చరణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘రంగస్థలం’. ఇందులోని మూడో పాట ‘రంగమ్మా… మంగమ్మా’లోని కొన్ని పాదాలపై యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చరణంలోని ‘గొల్లభామ వచ్చీ… నా గోరు గిల్లుతుంటే’ పదాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి యాదవ మహిళలను కించపరిచే విధంగా వున్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. (‘రంగస్థలం’ చిత్రానికి యాదవుల హెచ్చరిక! లింక్: https://www.telugu360.com/te/yadava-sangham-fires-rangasthalam/ )
ఈ వివాదంపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. యాదవ మహిళలను ఉద్దేశించి ‘గొల్లభామ..’ పదం రాయించలేదని ఆయన తెలిపారు. “గొల్లభామ అనేది గూగుల్లో వెతికితే వస్తుంది.. పెద్ద పెద్ద కాళ్లతో చూడగానే అందంగా కనిపించే ఒక పురుగు. ఆ పురుగును ఉద్దేశించి రాసిందే తప్ప మరో ఉద్దేశం లేదు. మా ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నట్టున్నాడు” అని సుకుమార్ వివరించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న విశాఖలో జరగనుంది.