ఏ దర్శకుడికైనా తన టీమ్‌లో ఓ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. దర్శకుడు సుకుమార్‌కి అది కాస్త ఎక్కువ. రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్ అంటే.. సుక్కుకి ప్రాణం. వాళ్లు లేకపోతే… తన సినిమా ఉండదు. వాళ్లతో ఎమోషనల్ బాండింగ్ కూడా ఎక్కువే. ఇప్పుడు సుకుమార్.. సమంత ప్రేమలో పడిపోయాడు. ”సమంత ఒప్పుకుంటే.. నా జీవితాంతం తన సినిమాలు చేస్తుంటా” అని ప్రకటించాడు సుకుమార్. సమంత అంతలా మాయ చేసిందన్నమాట. ‘రంగస్థలం’లో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. రామలక్ష్మి పాత్రలో ఆమె కనిపించనుంది. ఎంత సక్కగున్నావే.. అంటూ చంద్రబోస్ చేత.. సమంతపై ఓ పాట కూడా రాయించాడు చంద్రబోస్. అప్పటి నుంచి సమంత కాస్త రామలక్ష్మి అయిపోయింది. ఈ సినిమాలో సమంత నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం చెబుతోంది. సుకుమార్ సైతం ఆమె మాయలో పడిపోయాడేమో. అందుకే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓ దర్శకుడు తన కథానాయికని రిపీట్ చేయడం మామూలే. కానీ ‘నా జీవితాంతం నీతో సినిమా చేయాలనివుంది’ అని చెప్పడం మాత్రం బహుశా.. సమంత – సుకుమార్ విషయంలోనే జరిగి ఉంటుంది. మరి సుకుమార్ తదుపరి సినమాలోనూ సమంతే కథానాయికగా కనిపిస్తుందా? చూద్దాం.. సుక్కు కేవలం ఈ స్టేట్మెంట్ని మాటలకే పరిమితం చేస్తాడో, లేదంటే.. చేతల్లోనూ చూపిస్తాడో..??