తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు అంటే సుకుమార్ కి చాలా ఇష్టం. `నాన్నకు ప్రేమతో` కథ.. తన తండ్రి అంశయ్యపై ఉన్నప్పుడే పుట్టింది. `నాన్నకు ప్రేమతో` విడుదల సందర్భంలో.. వేదికపై సుకుమార్ కన్నీటి పర్యంతం అయ్యాడు కూడా. ఆ తరవాత.. `ఈనాడు` దిన పత్రిక కోసం నాన్నకు ఓ లేఖ కూడా రాసి, తన ప్రేమ చూపించాడు.
ఇప్పుడు తన తండ్రి జ్ఞాపకార్థం.. తన సొంత ఊరులో ఓ స్కూలు భవనాన్ని కట్టిస్తున్నాడు. సుకుమార్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు. అక్కడ ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం లేదు. అందుకే సుకుమార్ తన తండ్రి జ్ఞాపకార్థం సొంత ఖర్చుతో అక్కడ రెండు అంతస్థుల భవనం కట్టిస్తున్నాడు. ఈరోజు ఈ భవన నిర్మాణానికి రాజోలు ఎం.ఎల్.ఏ. రాపాక వరప్రసాదరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి కావల్సిన 14 లక్షల రూపాయల నగదుని ఈ రోజే.. సుకుమార్ కుటుంబ సభ్యులు ఎం.ఎల్.ఏకి అందజేశారు. ఇదే కాదు.. సొంతూరులో సుకుమార్ చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. అవన్నీ తన తండ్రి పేరు మీదే.