రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు… లాంటి దిగ్గజాలు డజన్ల కొద్దీ శిష్యబృందాలు తయారు చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. కానీ నవతరం దర్శకులు మాత్రం చిత్రసీమకు కొత్త దర్శకుల్ని ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒకరి దగ్గర శిష్యరికం చేసి, సినిమా గురించి మెళకువలు నేర్చుకుని, ఆ తరవాత తీరిగ్గా దర్శకత్వం వహించే ఓపిక ఇప్పుడు ఎవరికీ ఉండడం లేదు. అందరూ షార్ట్ ఫిల్మ్ బ్యాచులే. ఎవరి దగ్గరా, ఏమీ నేర్చుకోకుండానే సినిమాలు తీసేసే స్థాయికి చేరుకున్నారు.
అయితే సుకుమార్ నుంచి మాత్రం ఓ శిష్యుడు వస్తున్నాడు. తనే… బుచ్చిబాబు. తన శిష్యుడిపై నమ్మకంతో… సుకుమారే ఈ చిత్ర నిర్మాణంలో భాగం కూడా పంచుకున్నాడు. ఆ ప్రాజెక్టే `ఉప్పెన`. చాలా కాలంగా ఈ సినిమా సెట్స్‌పై ఉంది. బడ్జెట్ ఎక్కువైపోయిందన్న కామెంట్లూ వినిపించాయి. ఎమోషన్లు కూడా హెవీ డోసు లో ఉండబోతున్నాయట. అయితే.. ఇప్పటి వరకూ విడుదలైన రెండు పాటలూ చూస్తుంటే.. ఈ సినిమాకి హిట్టు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సినిమాపై పాజిటీవ్ టాక్ అప్పుడే మొదలైపోయింది. యూత్‌ని కట్టిపడేసే మెటీరియల్ ఈ సినిమాలో ఉందని అర్థమౌతోంది. అందుకే తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే బుచ్చిబాబుకు ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే, మైత్రీ మూవీస్‌లోనే మరో సినిమా చేయడానికి ఒప్పందం కుదిరిందట. అంతేకాదు.. యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించే చిత్రానికీ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తాడని చెప్పుకుంటున్నారు. టీజర్ రాకుండానే ఇన్ని ఆఫర్లు అందుకున్నాడంటే, సినిమా విడుదలై, పాజిటీవ్ టాక్ వస్తే… బుచ్చిబాబు మహా బిజీ అయిపోతాడన్నమాట. మొత్తానికి సుకుమార్ శిష్యుడు గట్టోడే.