హిట్లూ, ఫ్లాపులకు అతీతంగా గౌరవాన్ని సంపాదించే దర్శకులు చాలా తక్కువమందే ఉంటారు. కొన్నిసార్లు ఫ్లాపు సినిమాలు సైతం ఆయా దర్శకుల మార్క్ ఏమిటో చూపిస్తుంటాయి. సుకుమార్ అలాంటి దర్శకుడే. ‘జగడం’ సినిమా ఫ్లాప్ అంటారు. కానీ ఆ సినిమాకు వీర భక్తులున్నారు. ‘వన్ – నేనొక్కడినే’ ఎవరికీ అర్థం కాదన్న కంప్లైంట్లు వినిపిస్తాయి. అయితే అదో మాస్టర్ పీస్ అంటూ నెత్తిమీద పెట్టుకొన్న వాళ్లున్నారు. అది సుకుమార్ మార్క్. అలాంటి దర్శకుడు మాస్, కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ‘రంగస్థలం’, ‘పుష్ప 1’ నిరూపించాయి. ఇప్పుడు అందరి కళ్లూ ‘పుష్ప 2’పై పడ్డాయి.
ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాడు సుకుమార్. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. ఓ సినిమాని యజ్ఞంలా భావించి, పనిని తపస్సులా స్వీకరించే దర్శకుడు సుకుమార్. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. క్రియేటివిటీ ఎంతున్నా, ఎంత గొప్ప సినిమా తీసినా, కమర్షియల్ గా ఆడకపోతే ఆ కష్టం వృథానే. సినిమాకు సంబంధించి ముందు కమర్షియాలిటీ మాట్లాడుతుంది. ఆ తరవాతే క్రియేటివిటీ. అయితే క్రియేటీవ్ మైండ్ ని, కమర్షియాలిటీతో మిక్స్ చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. ‘పుష్ప 2’తో అది సాధ్యమై తీరుతుందన్నది అందరి మాట. నమ్మకం.
ఓ యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి పుష్ప క్యారెక్టర్ని హీరోగా, సూపర్ హీరోగా మార్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పాత్ర, దాని తాలుకూ లక్షణాలూ మాస్‌ని పట్టేస్తే తప్ప.. ఇంత వైబ్ కనిపించదు. రైటింగ్ లో సుక్కు చేసిన మ్యాజిక్ వల్లేల అది సాధ్యపడింది. విజువల్ పరంగా సుక్కు.. సినిమా సినిమాకీ మెరుగుపడుతున్నాయి. ‘రంగస్థలం’ నుంచి తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వరల్డ్ బిల్డింగ్ ని సరిగా అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా పాత్రల్ని, కథల్ని సృష్టిస్తున్నాడు. ‘పుష్ప’ అనే వరల్డ్ బిల్డ్ చేయడం, వాటి చుట్టూ పాత్రల్ని సృష్టించడం అనే పాయింట్ దగ్గరే సుకుమార్ సక్సెస్ అయిపోయాడు. ‘పుష్ప’తో వచ్చిన బజ్ పార్ట్ 2తో పది రెట్లయ్యింది. ఈసారి హిట్టు కొడితే లెక్క రూ.1000 కోట్ల నుంచి మొదలవుతుందని సుకుమార్‌కి కూడా తెలుసు. అందుకే ప్రతీ సీన్, ప్రతీ మూమెంట్ నీ.. చెక్కుతూ వెళ్లాడు. దాని వల్ల సినిమా ఆలస్యమైంది, బడ్జెట్లు, వడ్డీలూ తడిసి మోపెడయ్యాయి. అయినా సరే.. సుకుమార్ వెనక్కి తగ్గలేదు. ‘పుష్ప’లాంటి మాస్ హిట్ కొట్టాక, మూడేళ్ల పాటు ఒకే సినిమాకి కేటాయించడం హీరోలకే కాదు, దర్శకులకూ రిస్క్ ఫ్యాక్టరే. కానీ ఆ రిస్క్‌ని భరించాడు సుకుమార్.
‘నాకు పోటీ ఎవరైనా ఉన్నారంటే.. అది సుకుమార్ మాత్రమే’ అని ఎస్.ఎస్.రాజమౌళి చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. అది ముమ్మాటికీ నిజం. దేశంలోనే అత్యుత్తమ దర్శకుడి నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ అందుకోగల అర్హత.. సుకుమార్‌కు మాత్రమే ఉంది. ‘పుష్ప 2’ హిట్టయితే – దేశం మొత్తం సుకుమార్ వైపు చూస్తుంది. ‘రాజమౌళి తరవాతి స్థానం ఎవరిది?’ అని ఆరా తీసేవాళ్లకు సుకుమార్ ఓ జవాబులా కనిపిస్తాడు. తెలుగు చిత్రసీమకు ఇంతకంటే గర్వించే క్షణాలు ఏముంటాయి?