ఒక కథని, రెండు భాగాలుగా తీసి, రెండు సినిమాలుగా అమ్ముకోవడం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. బాహుబలితో అదెంత సక్సెస్ఫుల్ ఫార్ములానో తెలిసిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా తన్నిపెట్టి కూర్చుంది. ఇప్పుడు `పుష్ష`కి మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా `పుష్ష`. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది.
రెండు భాగాలుగా చేయాలనన్ది సుకుమార్ నిర్ణయం. లాభదాయకమైన ఆలోచనే కాబట్టి.. నిర్మాతలూ ఓకే అన్నారు. అయితే ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. రెండు భాగాలుగా తీయడానికి మరో 30 నిమిషాల కంటెంట్ అవసరమైంది. పార్ట్ 1కి కొన్ని, పార్ట్ 2కి కొన్ని సన్నివేశాలు జోడించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం సుకుమార్ మరోసారి స్క్రిప్టు విషయంలో తలమునకలు అయినట్టు భోగట్టా. ముందు అనుకున్నదాని ప్రకారం.. దేవిశ్రీ ఓ ఐటెమ్ సాంగ్ కంపోజ్ చేసి పెట్టాడు. ఇప్పుడు రెండో భాగానికి కూడా ఐటెమ్ సాంగ్ అవసరం ఏర్పడిందట. తొలి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో పాటలకు తక్కువ స్కోప్ ఉందట. అయినా సరే.. ఏదోలా పాటల్ని ఇరికించి, కాస్త రన్ టైమ్ పొడిగిద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు సుకుమార్. పార్ట్ 2లో కొత్త పాత్రలేవీ రావు. పార్ట్ 1లో ఉన్నవాళ్లే 2లోనూ కనిపిస్తారు. వాళ్లమధ్యే కొత్త సన్నివేశాల్ని సృష్టించాలి. సుకుమార్ అసలే టాస్క్ మాస్టర్. తాను పెన్ను పట్టుకుని కూర్చుంటే.. 30 నిమిషాల కథని పొడిగించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. మళ్లీ షూటింగు, లొకేషన్ల వేట.. అంటేనే సమస్య. మరి సుక్కు ఏం చేస్తాడో?