మరో 50 రోజుల్లో ‘పుష్ష 2’ రాబోతోంది. డిసెంబరు 6న పుష్షరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. అంతకంటే ఒక రోజు ముందు ప్రీమియర్లు ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 పాటలు మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. అక్కడక్కడ కొంతమేర ప్యాచ్ వర్క్ ఉంది. ఫస్టాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయ్యింది. సెకండాఫ్‌కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. నవంబరులో 2 పాటల్ని తెరకెక్కిస్తారు. అందులో ఓ ఐటెమ్ గీతం కూడా ఉంది.
‘పుష్ష పార్ట్ 3’ కూడా ఉందని చిత్రబృందం ముందే చెప్పింది. ‘పుష్ష 1’ అవ్వగానే పార్ట్ 2పై దృష్టి పెట్టారు. అయితే పార్ట్ 3 మాత్రం వెంటనే రాదు. మధ్యలో బన్నీ ఓ సినిమా, సుకుమార్ ఓ సినిమా చేయాలి. పార్ట్ 2 చివర్లో పార్ట్ 3కి సంబంధించిన ఓ క్లిప్ హ్యాంగర్ చూపించబోతున్నారు. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగిపోయింది. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో క్లిప్ హ్యాంగర్స్.. పార్ట్ 2పై ఆసక్తిని పెంచాయి. పుష్ష 2 క్లైమాక్స్ లో కూడా అలాంటి ఓ ఇంట్రో ఉంది. అయితే సుక్కు దాన్ని ఓ కొత్త పద్ధతిలో డిజైన్ చేశాడని, కాన్సెప్ట్ బ్రహ్మాండంగా సెట్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇప్పటి వరకూ వచ్చిన క్లిప్ హ్యాంగర్స్ ఒక ఎత్తయితే, పుష్ష పార్ట్ 3 మరో ఎత్తని సమాచారం.
ఐటెమ్ పాటలో కథానాయికగా ఎవర్ని ఎంచుకోవాలి అనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జాన్వీ కపూర్, దీప్తి తిమ్రీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రద్దాకపూర్ పేరు కూడా పరిశీలిస్తున్నార్ట. ఈ నెలాఖరుకల్లా కథానాయిక ఎవరన్నది తేలిపోతుంది. నవంబరు మొదటి వారంలో ఐటెమ్ గీతం చిత్రీకరణ ఉండొచ్చు.