బాహుబలి.. తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే పేరు. బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సినిమా. తెలుగు సినిమా స్టామినా.. ప్రపంచానికి చాటిన చిత్రరాజం. బాలీవుడ్ రికార్డులు కూడా బాహుబలి ముందు దాసోహం అన్నాయి. పీకే తరవాత.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి రికార్డు సృష్టించింది. గత యేడాది కాలంగా. నెంబర్ 2 బాహుబలినే. ఇప్పుడు ఆ రికార్డుకు ముప్పు పొంచి ఉంది. సల్మాన్ సుల్తాన్… బాహుబలి రికార్డుకు ఎసరు పెట్టడానికి రెడీ అయ్యాడు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.600 కోట్లు సాధించింది. ఈ రికార్డుని సుల్తాన్ ఎగరేసుకుపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ శుక్రవారం విడుదలైన సుల్తాన్‌కి అన్ని చోట్లా మంచి స్పందన వస్తోంది. విమర్శకులు భేష్.. అన్నారు. ఆడియన్స్ పిదా అయ్యారు. ఇక సల్మాన్ ఫ్యాన్స్ అయితే కాలర్లు ఎగరేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పై చిలుకు వసూళ్లు సాధించిందీ చిత్రం. ఈ జోరు ఇలానే కొనసాగితే… 500 కోట్ల మైలు రాయిని చేరుకోవడం అంత కష్టమేం కాదంటున్నారు. పెద్ద సినిమాల తాకిడేం లేదు గనుక.. బాహుబలి ని కూడా బ్రేక్ చేసే సత్తా.. ఉందని లెక్కలు గడుతున్నారు. నెంబర్ వన్‌లో ఉన్న పీకే (700 కోట్లు) కాస్త రిలాక్స్‌గా ఉన్నా… సుల్తాన్ ప్రభంజనానికి బాహుబలి రికార్డు బద్దలైపోతుందేమో అన్న భయం నెలకొంది. అదే జరిగితే… బాహుబలి 2 నుంచి 3 వ స్థానానికి పడిపోతుంది.