కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడోరోజే 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఖాయం చేసుకుంది.
సల్మాన్, అనుష్క శర్మ నటించిన సుల్తాన్ రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం విడుదలైంది. తొలిరోజే 36.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 37.2 కోట్లు వసూలు చేసింది. అంటే మొదటి రెండు రోజుల్లోనే 73.7 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం కలెక్షన్లతో కలిసి మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు బాలీవుడ్ జనాలు.
ఈ లెక్కన మొదటి వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ కూడా టాప్ రేంజిలో ఉందట.
ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాపర్ దర్శకుడు. దర్శకుడు అలీ అబ్బాస్ కథను అందించాడు. నిర్మాత ఆదిత్య చోప్ర స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. విశాల్, శేఖర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.
70 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఒక్క నెలరోజుల్లోనే 300 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేస్తుందనేది బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనా. ఈ లెక్కన నిర్మాతకు, బయ్యర్లకు లాభాల పంట పండినట్టే.
కుస్తీ వీరుడి కథతో రూపొందించిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఎ క్లాస్ నుంచి సి క్లాస్ వరకూ అన్ని చోట్లా కలెక్షన్ టాప్ రేంజిలో ఉన్నాయని టాక్.
బడా నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో అయితే సుల్తాన్ క్రేజ్ పీక్ స్టేజికి చేరింది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి వారంలో, మొదటినెలలో ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూద్దాం.