హైదరాబాద్ లో సామాన్యులు ఇల్లు కొనుగోలు చేయాలంటే శివార్లకు వెళ్లాల్సిందే. ఓ మాదిరి సొంత ఇల్లు కోసం ప్రజలు ఇప్పుడు ఔటర్ కు అటూ ఇటూగా పది కిలోమీటర్ల వరకూ వెళ్లడానికి సిద్దపడుతున్నారు. అందుకే ఆయా ప్రాంతాల్లోనూ రేట్లు భారీగా ఉంటున్నాయి. కొన్నిప్రాంతాల్లో మాత్రం ఔటర్ పక్కనే తక్కువ కు ఇళ్ల స్థలాలు లభ్యమవుతున్నాయి.
అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఇటీవల సమీప గ్రామాలను విలీనం చేశారు. అలా విలీనం అయిన వాటిలో సుల్తాన్ పూర్ ఒకటి. ఓఆర్ఆర్ పక్కనే ఉండే ఈ గ్రామంలో ఇటీవలి కాలంలో జోరుగా రియల్ ఎస్టేట్ సాగుతోంది. పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కిందటి వరకూ ఈ ప్రాంతంలో ధరలు చాలా తక్కువగా ఉండేవి. కానీ అక్కడ వెంచర్లు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. రోడ్లు మెరుగుపడటం.. బడా సంస్థల చూపు అటువైపు పడటంతో రేట్లు పెరిగిపోతున్నాయి.
ఏడాది కిందటి వరకూ పదిహేను వేలలోపు ఉండే గజం ధర ఇవాళ పాతిక వేల వరకూ వచ్చింది. అయినా ఇతర ప్రాంతాలతోపోలిస్తే సామాన్యులకు అందుబాటులో ఉన్నట్లే. ఇళ్లు కట్టుకోవడానికి అనువుగా లే ఔట్లను సిద్దం చేస్తున్నారు. చిన్న చిన్న బిల్డర్లు ఇప్పటికే ఇళ్లు కట్టి అమ్ముతున్నారు. అమీన్ పూర్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ హాట్ కేక్ గా ఉంది. అమీన్ పూర్ లో సూల్తాన్ పూర్ కలసిపోవడం వల్ల త్వరలోనే సామాన్యులకు అందని స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదన్న భావన ఉంది.