`మళ్లీ రావా`తో ఓ హిట్టు అందుకున్నాడు సుమంత్. అయితే దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ఆపసోపాలు పడుతున్నాడు. మళ్లీ రావా తరవాత విడుదలైన రెండు సినిమాలూ (సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్) ఫ్లాపులయ్యాయి. అయితే కొత్త దర్శకులు ఇప్పటికీ సుమంత్ తలుపు తడుతూనే ఉన్నారు. కథ విషయంలో సుమంత్ ఎంత పట్టు చూపిస్తున్నాడో తెలీదు గానీ, హీరోయిన్ల విషయంలో మాత్రం సుమంత్ కాస్త స్డడీగానే ఆలోచిస్తున్నాడు. తన సినిమాల్లో కథానాయికలుగా అందమైన ముఖాలు కనిపించాలని తహతహలాడుతున్నాడు. హీరోయిన్లుగా పేరున్నవాళ్లనే తీసుకోవాలని, తద్వారా సినిమాకి అదనపు మైలైజీ తీసుకురావాలని చూస్తున్నాడు. తనకంటే వయసులో సగం వయసున్న అమ్మాయిల్ని ఎంచుకోవాలని దర్శకులకు సూచనలు ఇస్తున్నాడట.
సుమంత్ పక్కన నటిస్తే.. ఆ సినిమా ఫ్లాపయితే, తరవాత అవకాశాలు వస్తాయా? రావా? అని హీరోయిన్లు బెంగ పెట్టుకుంటారు కదా? దానికీ సుమంత్ ఆ ఆఫర్ ఇస్తున్నాడు. తనతో పాటు నటిస్తే అక్కినేని హీరోలు (నాగ్, నాగచైతన్య, అఖిల్)లలో ఒకరితో నటించే ఛాన్స్ ఇస్తానంటున్నాడట. ఆకాంక్ష సింగ్కి అలానే ఆఫర్ ఇచ్చాడు. `మళ్లీ రావా`లో నటించిన ఈ అమ్మాయి.. వెంటనే `దేవదాస్`లో నాగార్జున పక్కన సెట్టయిపోయింది. ఒకవేళ అక్కినేని హీరోలు ఎవరితోనైనా సినిమాలు చేయాలనుకుంటే, ముందు సుమంత్లో నటిస్తే చాలు. లైన్ క్లియర్ అయిపోతుంది. తన కొత్త సినిమా కోసం సిమ్రట్ కౌర్ అనే అమ్మాయిని హీరోయిన్గా ఎంచుకున్నాడు సుమంత్. ఆ అమ్మాయికీ ఇదే ఆఫర్ ఇచ్చాడట. అంటే.. సిమ్రట్ త్వరలోనే అక్కినేని హీరోయిన్ అయిపోతుందన్నమాట.