హైదరాబాద్: సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – ఇద్దరినీ కడిగి పారేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో పెరుగుతోందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కేసీఆర్ చేసిన వాగ్దానాల్లో ఒక్క శాతంకూడా అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారని, ఆయనకు అన్నింటికంటే డబ్బుపైనే ఎక్కువ విశ్వాసముందని అన్నారు. బాబు దగ్గర ప్రతిదానికీ ఒక రేటు ఉందని విమర్శించారు. కోటీశ్వరులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు, శత కోటీశ్వరులకు కేంద్రంలో, రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టారని, వీరిలో కొందరు అసలు టీడీపీలోనే లేరని, అటువంటి వారికి పదవులు దక్కాయని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే గతంలో గెలిచిన సీట్లలో సగంకూడా టీడీపీకి రావన్నారు. బీజేపీని చంద్రబాబు తన మెడకు చుట్టుకోవటంతో టీడీపీ, బీజేపీ రెండూ మునగటం ఖాయమని చెప్పారు.
మరోవైపు కేసీఆర్ పాలనపై స్పందిస్తూ, చంద్రబాబుకు కొంచెెం పొలిటికల్ కల్చర్ ఉందని, కేసీఆర్కైతే అదికూడా లేదని సురవరం విమర్శించారు. పరిపాలనలో భాగంగా వివిధ విషయాలపై చంద్రబాబు తన కేబినెట్ అనుచరులు, పార్టీ నాయకులతో చర్చిస్తున్నట్లు కనిపిస్తోందని, కేసీఆర్‌లో కనీసం ఆ సంస్కారంకూడా లేదని అన్నారు. అందుకే ఆయన పార్టీకి, ప్రజలకు, సహచరులకు దూరమవుతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడి తరహాలో తనకు తోచిన విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ బలహీనతల గురించి బాబుకు, కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని, ఆ కారణంగానే ప్రజల బలహీనతలపై దెబ్బకొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోకుండా ఇద్దరు ముఖ్యమంత్రులూ లౌకిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు.
సీపీఐ అగ్ర నాయకుడు సురవరం కొంతకాలంగా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. సీపీఐ నారాయణ చంద్రబాబుపై మెతకవైఖరి ప్రదర్శిస్తుండగా సురవరం మాత్రం విరుద్ధంగా వెళ్ళటం విశేషం. మరోవైపు సురవరం బాబు, కేసీఆర్‌పై ఈ విమర్శలన్నీ సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేశారు. సురవరం కుమారుడు సాక్షి గ్రూప్‌లో ఒక కీలక పదవిలో ఉన్నారని సమాచారం.