యాంకర్ గా సుమ చిర పరిచితురాలు. తను లేని.. సినిమా వేడుకల్ని ఊహించలేం. హీరోల్లో కూడా తనకు ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి తను నటి కావాలనే ఇండస్ట్రీకి వచ్చింది. కానీ అనుకోకుండా యాంకర్ అయ్యింది. అదీ మంచికే. ఇప్పుడు ఆ రంగంలోనే స్టార్ గా వెలుగుతోంది. మళ్లీ చాలా కాలం తరవాత.. మేకప్ వేసుకుంది. తాను ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ.. సినిమా విడుదలకు సిద్ధమైంది. మే 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
“రా బావా… మా ఊరి పంచాయితీ చూద్దువు గానీ… ఏ ఊర్లో లేని ఎరైటీ గొడవ జరుగుతోంది..“ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. దాన్ని బట్టి… ఓ ఊరి పంచాయితీ దగ్గరకు విచిత్రమైన సమస్య వచ్చిందన్నది అర్థమైంది. ఈ ట్రైలర్ అంతా పంచాయితీ, దాని గొడవ చుట్టూ తిరిగినా, ఆ సమస్యేమిటన్నది దాచేశారు. బహుశా.. థియేటర్లోనే చూడాలనేమో. ఓ పల్లెటూరు, అక్కడి విచిత్రమైన మనుషులు, ప్రేమ కథలు, వాళ్ల సమస్యలూ… ముఖ్యంగా పంచాయితీ.. వాటి మధ్యనే ఈ సినిమా తిరగబోతోందన్న విషయం ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. సుమ డైలాగ్ డెలివరీ, తన యాస.. ఆకట్టుకున్నాయి. ఈ కథని మెయిన్ పిల్లర్ తనే. సరదా సరదాగానే ట్రైలర్ మొదలైనా, చివర్లో ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఎం.ఎం.కీరవాణి లాంటి దిగ్గజం.. ఈ సినిమాని పని చేయడం ప్లస్ పాయింటే. సుమ తప్ప తెలిసిన మొహాలేం లేవు. విజయ్ కుమార్ కాలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బలంల ప్రకాష్ నిర్మాత.