జిఎస్టి అమలు మంచి చెడ్డలపై చాలా చర్చ వుంది. దానివల్ల రాష్ట్రాలకు లక్ష కోట్లు ఆదాయం కోల్పోవడం, కార్పొరేట్ కంపెనీలు లాభపడటం, చిరు వ్యాపారులు చిక్కుల్లో పడటం, వినియోగదారులపై వీరబాదుడు ముందు ముందు చూడబోతాము. అనిల్ అంబానీ వంటివారే దాన్ని రెండుచేతులా ఆహ్వానించారు.ఇక ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీకొచ్చే లాభాలను ప్రజలకు బదలాయించాలని చెబుతున్నారంటేనే విషయం తెలిసిపోతుంది. పైగా ఆఖరి నిముషంలో వ్యవసాయ పరికరాలపై పన్ను తగ్గించి సినిమాల విషయం ఆలోచన ప్రారంభించినట్టు సమాచారం.
ఆ వివరమైన చర్చ అలా వుంచితే జిఎస్టి ప్రారంభ సూచకంగా జూన్30 అర్ధరాత్రి జరిగిన పార్లమెంటు సెంట్రల్‌హాలులో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదర్శించిన రాజకీయ చతురత చెప్పుకోదగింది. కాంగ్రెస్ అభ్యర్థిగాఎన్నికైన ప్రణబ్ ఆర్థిక మంత్రిగా వున్నప్పుడే ఇది మొదలైంది. ఆ విషయం వివరంగా తేదీలతో సహా చెప్పడం ద్వారా ఆయన గత చరిత్రను గుర్తు చేశారు.అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న ప్రస్తుత ప్రధాని మోడీ జిఎస్టిని గట్టిగా వ్యతిరేకించారు. ఆయన పేరు చెప్పకుండా ఆ రాష్ట్రం పేరు మాత్రం ప్రస్తావించిన ప్రణబ్ ఈ రాష్ట్రాలన్నీవివిధ దశల్లో వివిధ రకాల అభిప్రాయాలు చెప్పడం ద్వారా చర్చకు దోహదం చేశాయని దాటేశారు. తాను 16 సమావేశాలకు హాజరైనానంటూ విభేదాలను గుర్తు చేశారు. వాస్తవానికి మొదట జిఎస్టిని రాష్ట్రపతి సమక్షంలో ప్రధాని ప్రారంభిస్తారని కార్యక్రమం ప్రకటించారు గాని అది ప్రొటోకోల్కు విరుద్ధమని గుర్తించి ఉభయులూ కలసి చేసేలా మార్చారు. తనదైన శైలిలో దీర్ఘంగానే ప్రసంగించిన మోడీ కూడా రాజకీయ వ్యతిరేకిగా వున్న మమతా బెనర్జీని వామపక్షాలను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాల వంటివి వెనకబడి వున్నాయని వ్యాఖ్యానించి వదిలేశారు. ఇక ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తను జిఎస్టిపై మొదటి పాఠం సిపిఎం ఆర్థిక మంత్రి అషిందాస్ గుప్తా దగ్గర విన్నానంటూ వారిని కూడా భాగస్వాములను చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రత్యేక సమావేశాలను కాంగ్రెస్ వామపక్షాలు డిఎంకె బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మొదట వస్తారనుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాలేదు గాని చానాళ్ల తర్వాత దేవగౌడ మాజీ ప్రధాని హౌదాలో హాజరైనారు!
ఇక ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ , సమాజ్‌వాదిపార్టీ నేతలు పాల్గొని తాము కాంగ్రెస్‌తో లేమని సంకేతం ఇచ్చారు. జైట్లీ ప్రస్తావించిన అషిందాస్ గుప్తా మాత్రం జిఎస్టిపై మొదటి కమిటీ అద్యక్షుడుగాపాల్గొన్నారు. అమితాబ్ బచన్ వస్తాడని చెప్పినా రాలేదు. మొత్తంపైన జిఎస్టి ప్రారంభం కాస్త నీరసంగా యాంత్రికంగా జరిగిపోయిందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.