జనసేన పార్టీ స్థాపించిన తరువాత, మొట్ట మొదటిసారి ఆంధ్రా రాజధాని అమరావతిలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉద్దానం సమస్యతోపాటు రాష్ట్రంలోని పలు ఇతర సమస్యలపై కూడా ఆయన స్పందించారు. అక్టోబర్ నుంచి తాను యాక్టివ్ పాలిటిక్స్ కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు పవన్ ప్రకటించారు. పార్టీ నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టి, రాష్ట్రంలోని వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించే దిశగా కృషి చేస్తానని పవన్ అన్నారు.
ఉద్దానం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాననీ, శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని కోరినట్టు పవన్ చెప్పారు. నిజానికి, ఇప్పటికే ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించిందనీ, కొన్ని డయాలసిస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఉద్దానంలో ఒక టాప్ క్లాస్ రీసెర్చ్ సెంటర్ కావాలనే డిమాండ్ ను సీఎం ముందు ఉంచాననీ, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారనీ, దీనికోసం ఇప్పటికే కొన్ని నిధులు ఉన్నాయని కూడా సీఎం వివరించినట్టు చెప్పారు. ఉద్దానంలో అనాథలు అయిపోతున్న పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనీ, వారిని దత్తత తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరానన్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు పవన్ చెప్పారు. ఉద్దానం బాధితులు సమస్య వ్యక్తిగతంగా తనని కలచి వేసిందని అన్నారు. ఇలాంటి సమస్యలపై పనిచేసేందుకు కొంతమంది స్వచ్ఛదంగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. అక్కడున్న రాజకీయ పరిస్థితులు వారిని బయటకి రానీయడం లేదని పవన్ అన్నారు. అలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్దానం సమస్యకు సంబంధించి ఇది తన మొదటి మెట్టు అనీ, ఆ సమస్యను మూలాల నుంచి రూపుమాపడమే లక్ష్యమని, ఈ క్రమంలో ప్రభుత్వంతో కో ఆర్డినేట్ చేసుకుని జనసేన పనిచేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
గరగపర్రు ఇష్యూపై పవన్ స్పందించారు. ఈ ఇష్యూ తన దృష్టికి వచ్చిందనీ, తాను స్వయంగా అక్కడికి వెళ్తే పరిస్థితి ఇంకోలా మారిపోయే అవకాశం ఉంటుందని స్పందించలేదని పవన్ చెప్పారు. ఇది చాలా సున్నితమైన అంశమనీ, తాను వచ్చి మాట్లాడితే, తనతోపాటు ఉత్సాహవంతులైన యువత వస్తారనీ, వాళ్ల మధ్య ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు చొరబడతాయో చెప్పలేమనీ, గరగపర్రుకి వ్యక్తిగతంగా రాకపోవడానికి ఇదే కారణమన్నారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ బాధితుల విషయం కూడా పవన్ ప్రస్థావించారు. ఆ ప్రాజెక్ట్ విషయంలో నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా..? నిబంధనలు సక్రమంగా పాటిస్తుంటే, వాటిని ప్రజలకు తేటతెల్లం చేయాల్సిన పరిస్థితి ఉందని పవన్ అన్నారు. ఇది వ్యక్తిగతంగా తాను వచ్చి హ్యాండిల్ చేయాల్సిన సమస్య కాదనీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు దీని గురించి ఆలోచించి, ప్రజలకు నిజంగానే హాని జరుగుతోందా అనేది చూడాలన్నారు. అక్కడ జరుగుతున్న నష్టాన్ని ఎలా పూడ్చాలనేది, లేదా అంతా బాగానే ఉందనుకుంటే ఆ విషయాన్ని ప్రజలకు ఎలా నచ్చజెప్పాలనేది విశ్లేషించుకోవాలన్నారు. ఒకవేళ నిబంధనల అతిక్రమణ ఉంటే దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
కాపుల రిజర్వేషన్ల అంశాన్ని కూడా పవన్ ప్రస్థావించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి ఆలోచించాలనీ, ఒకవేళ దీని వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందంటే దాన్ని ఎలా భర్తీ చేయాలో కూడా ఆలోచించాలన్నారు.ఇది కూడా చాలా సున్నితమైన సమస్యే అని పవన్ చెప్పారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే ముద్రగడ పద్మనాభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పవన్ కోరారు. తన పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. మిగతావాళ్లు పాదయాత్ర చేయడానికి తాను వెళ్లడానికి తేడా ఉంటుందన్నారు. తాను ప్రజల్లోకి వెళ్తే శాంతి భద్రతల సమస్య ఉండకూదనీ, అందుకే వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీతో తన స్నేహం రహస్యం కాదనీ… బహిరంగమే కదా అని పవన్ అన్నారు. అయితే, ఇది అంశాల వారీ స్నేహమే అనీ, ప్రజల సమస్యల గురించి ప్రశ్నించాల్సి సందర్భాలు వస్తే తాను ఎలా స్పందిస్తున్నానో అందరూ గమనిస్తున్నారు కదా అని పవన్ అన్నారు. ప్రజా సమస్యలకు రాజకీయంగా పరిష్కార మార్గాలు కనుగొనేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని తానేం విడిచిపెట్టెయ్యలేదనీ, జరగాల్సిన జరుగుతోందనీ చెప్పారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ… ఒక పార్టీ చేస్తే తప్పు అని చెప్పొచ్చు, అన్నీ పార్టీలూ ఇదే పని చేస్తుంటే ఏమనాలనీ, దొరక్కపోతే అందరూ దొరలనీ, దొరికితే దొంగలని పవన్ అన్నారు. జనసేన పేరుతో నిధులను వసూళ్లు చేస్తున్నవారిని నమ్మొద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలాంటి వేవైనా అవసరం అనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని పవన్ చెప్పారు.
మొత్తానికి పవన్ ప్రెస్ మీట్ ఈ విధంగా జరిగింది! కర్ర విరగలేదు… పాము చావలేదు అన్న చందంగా, అన్ని సమస్యలనూ టచ్ చేస్తూనే… కొన్ని సున్నితమైనమనీ, మరికొన్ని సునిశితమైనవనీ, ఇంకొన్ని సమస్యలపై అధ్యయనం చేయాలనీ, జనసేన ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోందనీ… ఇలా పవన్ పైపైనే మాట్లాడుకుంటూ వెళ్లారు. పవన్ మాటల్లో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ధ్వనించింది… ఏ సమస్య విషయంలోనైనా ప్రభుత్వ వైఫల్యాన్ని, ముఖ్యంగా చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయలేదు! అదే బాటమ్ లైన్..!