స్టార్ నిర్మాతే కాదు స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజుకి తిరుగుండదని అందరికి తెలిసిన విషయమే. సీజన్ ఏదైనా పోటీలో నాలుగైదు సినిమాలున్నాయంటే అవి తాను నిర్మించకపోయినా సరే తను డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు ఘడిస్తుంటాడు దిల్ రాజు. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ఇక సమ్మర్ లో రిలీజ్ కానున్న నాలుగు పెద్ద సినిమాలను కైవసం చేసుకున్నారట.
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. ప్రి రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టేస్తున్న ఈ సినిమా నైజాం రైట్స్ దిల్ రాజు దక్కించుకున్నాడట. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు సినిమా కూడా దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇదే కాక కింగ్ నాగార్జున, కార్తి జంటగా నటిస్తున్న ఊపిరి సినిమాను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.
ఇవన్ని చాలదు అన్నట్టు భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి విక్టరీ వెంకటేష్ తో ‘బాబు బంగారం’ అనిపిస్తున్న మారుతి సినిమాను కూడా దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. ఓ పక్క నిర్మాతగా లాభాలను పొందుతూనే మరో వైపు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు తన హవా కొనసాగిస్తున్నాడు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమాలు దిల్ రాజుకి కాసుల వర్షం కురిపిస్తాయో లేదో చూడాలి.