డ్రగ్స్ – ఫిల్మ్ ఇండ్రస్ట్రీ…. అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా, చాలామంది స్టార్ల పేర్లు బయటకు వస్తాయి. ‘వాళ్లు వాడతారట.. వీళ్లు వాడతారట’ అంటూ గుసగుసలు వినిపిస్తాయి. అవెంత వరకూ నిజమో తెలీదు గానీ, కొంతమందిని మాత్రం అనుమానపు చూపులు చూడాల్సివస్తుంది. ”మాలో కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారు” అంటూ ఆమధ్య పోసాని కృష్ణమురళి ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఖంగుతింది చిత్రపరిశ్రమ. డ్రగ్స్ తీసుకొంటారన్న మాట నిజమే గానీ, దాన్ని ఒప్పుకొనే ధైర్యం ఎవరికి ఉందిక్కడ?? అయితే ఈ రోజు చిత్రసీమ తరపున ఫిల్మ్‌చాంబర్‌లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు పెద్దలు. అందులో సురేష్‌బాబు, అల్లు అరవింద్ లాంటి కింగ్ మేకర్స్ పాల్గొనడం, టాపిక్ డ్రగ్స్ కావడంతో మళ్లీ హాట్ టాపిక్‌కి తెర లేచినట్టైంది.
ఓ పదిమంది డ్రగ్స్‌ని వాడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చిందని, వాళ్లు త్వరగా ఆ అలవాటు నుంచి బయటపడాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ పది మంది ఎవరన్న సంగతి బయటకు చెప్పలేదు గానీ.. వాళ్లెవరో అటు పోలీసులకు, ఇటు పరిశ్రమ పెద్దలకు తెలిసిపోయిందన్నది సుస్పష్టం. అంతేకాదు… పదిమందిలో కొందరికి ఫోన్లు చేసి ‘మీ వ్యవహారం బాగోలేదు.. సరిదిద్దుకోండి. పోలీసుల నిఘా మీమీద ఉంది’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా.. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వెనుక ముఖ్య ఉద్దేశం ఒకటే. డ్రగ్స్ వాడుతున్నవాళ్లని ఎలెర్ట్ చేయడం. ‘మీ పని మీరు మానుకోండి’ అంటూ సలహా ఇవ్వడం. తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ వాడుతున్నది కేవలం పది మందే అంటే నమ్మబుద్ది కావడం లేదని, ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఓ వర్గం గట్టిగానే వాదిస్తోంది. మరీ ముఖ్యంగా నవతరం కథానాయకుల్లో కొంతమంది డ్రగ్స్ కి బాసిసలు అయ్యార్ట. వాళ్లందరినీ లైన్లో పెట్టడానికీ… ఇలాంటి ప్రెస్ మీట్లూ, వార్నింగులు ఉపయోగపడతాయి.