రెండేళ్ళ క్రితం అంటే 2014, జనవరి 17న కాంగ్రెస్ పార్టీ ఎంపి శశీ ధరూర్ భార్య సునంద పుష్కర్ డిల్లీలోని లీలా హోటల్ అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అనుమానాస్పద పరిస్థితులలో మరణించింది. అప్పటి నుండి దీనిపై పోలీసుల దర్యాప్తు సాగుతూనే ఉంది. ఈ కేసులో ఆమె భర్త శశీ ధరూర్ ని పోలీసులు కొన్నిసార్లు ప్రశ్నించారు కానీ ఇంతవరకు ఆమె మృతికి కారకులెవరో, ఆమె ఏవిధంగా మృతి చెందిందో కనిపెట్టలేకపోయారు. ఆమెపై అణుధార్మికత గల పదార్ధం ప్రయోగింపబడటం చేత మరణించినట్లు అనుమానించిన డిల్లీ పోలీసులు, సునంద పుష్కర్ అంతర్ అవయవ భాగాలను కొన్నిటిని అమెరికాకు పంపించి దానిపై ఎఫ్.బి.ఐ.కి పంపించి నివేదిక కోరారు. వాటిలో ఎటువంటి అణుధార్మికత లేదని ఎఫ్.బి.ఐ. తన నివేదికలో తెలియజేయడంతో డిల్లీ పోలీసుల దర్యాప్తు మళ్ళీ మొదటికి వచ్చిన్నట్లయింది.
డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ వైద్యులు 43 పేజీల కూడిన ఒక ఫోరెన్సిక్ నివేదికను తమకు అందజేశారని, అందులో సునంద పుష్కర్ ది అసహజ మరణమని స్పష్టంగా పేర్కొన్నారని డిల్లీ పోలీస్ కమీషనర్ బి.ఎస్.బస్సి ఇవ్వాళ్ళ డిల్లీలో మీడియాకు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా తాము దర్యాఫు కొనసాగించి సునంద పుష్కర్ మృతికి కారకులయినవారిని తప్పకుండా పట్టుకొంటామని తెలిపారు. కనుక త్వరలోనే శశీ ధరూర్ ని మళ్ళీ ప్రశ్నించడానికి పోలీసులు పిలువవచ్చును.