సన్‌బర్న్ భారీ నైట్ పార్టీకి 2007లో శ్రీకారం చుట్టింది గోవా. కొన్ని ఎకరాల స్థలంలో పదుల సంఖ్యలో వేదికలు, వందల సంఖ్యలో డిజెలు, మిరుమిట్టు గొలిపే లైట్లు, చెవులు చిల్లులు పడే సంగీతం… అది ఒక పార్టీ అనలేం. ఎన్నో పార్టీల వేదిక. దాదాపు 3లక్షల మందిపైగా ఏటేటా ఈ ఈవెంట్‌కి హాజరవుతారని అంచనా. అందుకే ప్రపంచంలోని టాప్‌టెన్ మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో ఒకటిగా గుర్తించింది సిఎన్ఎన్.
సెలబ్రిటీలకు కేరాఫ్…
డిసెంబర్ నెలాఖరు రోజుల్లో గోవాలో 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కు పార్టీ యానిమల్స్ క్యూ కడతారు. దేశవ్యాప్తంగా మెట్రోల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సినీ సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉంటారనేది పార్టీ సర్కిల్లో అందరికీ తెలిసిన విషయమే. అపరిమితమైన స్వేఛ్చా పిపాసుల కోసం రూపుదిద్దుకునే ఇలాంటి ఈవెంట్స్‌లో సహజంగానే డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలతో పాటు విశృంఖల కార్యకలాపాలకూ చోటు దక్కుతుందనేది నిస్సందేహం.
మెట్రోలకూ ప్రమోషన్ ఈవెంట్స్…
ఈ నేపధ్యంలోనే ఈవెంట్‌ను మరింత సక్సెస్ చేయడానికి మిగిలిన మెట్రోల్లో కూడా నవంబరు నెలలో కేవలం ఒక్క రోజున అదీ కొన్ని గంటల పాటు మాత్రమే నిర్వహించడం మొదలుపెట్టారు. అదీ సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభించి రాత్రి 10గంటల లోపే ముగిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సినిమాకి ముందు టీజర్ లాంటివే తప్ప ఒరిజినల్ సన్‌బర్న్‌కు ఏ రకంగానూ ఇవి సాటిరావు. ఇవి. ఇతర నగరాల నుంచి కూడా మరింత మందిని గోవా వైపు నడిపించడమే నిర్వాహకుల ఉద్ధేశ్యం. అలా అన్ని నగరాలతో పాటు ఈ ఈవెంట్ 2014లో హైదరాబాద్‌కి కూడా వచ్చింది. తొలి ఈవెంట్ సూపర్ హిట్ అయింది. ఇందులో దాదాపు 10వేల మంది పాల్గొన్నారని అంచనా.
మ్యూజిక్… కిక్ గత నాలుగేళ్లుగా ఏటేటా జరుగుతున్న ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కి ఏటేటా టాప్ డిజెలను రప్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాప్యులరైన డిజెల పట్ల కాలేజ్ యూత్‌లో ఉండే ఫాలోయింగ్ ఆధారంగా రూ.2500 నుంచి మొదలుకుని రూ.10వేలు ఆపైన కూడా టిక్కెట్ల ధరలు నిర్ణయిస్తుంటారు. అనుమతించిన ప్రకారం ఈ ఈవెంట్స్‌లో మద్యం సైతం విక్రయిస్తారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా కాపలాగా భారీ స్థాయిలో బౌన్సర్లను నియమిస్తారు.
హైదరాబాద్ కా బాత్ ఏమిటంటే…
గత కొంత కాలంగా జరుగుతున్న ఈవెంట్ అయినప్పటికీ హైదరాబాద్‌లో ఈ సారి వివాదం రాజుకోవడానికి ప్రధాన కారణం గోవాలో ఈ ఈవెంట్‌ని అక్కడి కొత్త ప్రభుత్వం అనుమతించకపోవడమే. దీంతో సన్‌బర్న్ ఈ ఏడాది పూనెకి తరలిపోయింది. దీంతో మన దగ్గర కూడా దీన్ని అనుమతించవద్దంటూ తొలుత రేవంత్‌రెడ్డి ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. విహెచ్ నిరసనలు చేపట్టారు. మరొక కాంగ్రెస్ నేత కోర్టుకెక్కారు. మైనర్లను అనుమతించడం, ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు, డ్రగ్స్ వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఈ ఈవెంట్ జరుగుతున్న తీరును పూర్తిగా వీడియో రికార్డ్ చేయించాలని కోర్టు ఆదేశించింది. ఏదేమైనా… ఈ ఈవెంట్ గత శుక్రవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎప్పటిలానే పూర్తయింది. గత ఏడాదితో పోలిస్తే కాస్త బందోబస్తు పెరగడం తప్ప అంతకు మించి ఏ వ్యత్యాసమూ కనిపించలేదు. వీడియో రికార్డింగ్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోనుంది.