‘అండర్ రేటెడ్’ ట్యాగ్ వేసుకొన్న హీరో.. సందీప్ కిషన్. పాపం.. కష్టపడుతుంటాడు కానీ, సరైన ఫలితాలు రావడం లేదు. తన రెండేళ్ల కష్టం.. ‘మైఖేల్’. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడంలో, ఇలా.. భారీ ఎత్తున విడుదల కావడంలో తన పాత్ర ఎంతో ఉంది. ‘మైఖేల్’ అనేది సందీప్ కిషన్ బ్రెయిన్ ఛైల్డ్. ఓ ఐడియా పట్టుకొని, దర్శకుడ్ని వెదుక్కొని, ప్రాజెక్ట్ సెట్ చేసుకొన్నాడు. రేపు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై సందీప్ చాలా ధీమాగా ఉన్నాడు. ”ఓ మంచి కథ. సరైన ఆర్టిస్టులు. కావల్సిన డ్రామా, కోరుకొనే యాక్షన్.. ఇవన్నీ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా తప్పు చేయదు” అంటూ మైఖేల్ పై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ”పేపర్ పై రాసుకొన్న సినిమా… తెరపైకొస్తే సరిపోతుంది. కానీ పది రెట్లు బాగా తీశాం. ఈ కథని ఇంతకంటే ఎవరూ బాగా చెప్పలేడు. అందుకే నాకీ సినిమాపై ఇంత నమ్మకం ఏర్పడింది..” అంటున్నాడు సందీప్. తన రాబోయే సినిమాల లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. భైరవకోన చిత్రీకరణ దశలో ఉంది. వీటన్నింటితో పాటు.. త్వరలోనే ఓ షాకింగ్ ప్రాజెక్టుతో వస్తున్నాడట. ఆ కాంబినేషన్ చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోతారని, తాను కూడా కలలో కూడా ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని ఊహించలేదని… చెప్పుకొచ్చాడు సందీప్. మరి ఆ దర్శకుడెవరో, ఆ ప్రాజెక్టు ఏంటో…? చూడాలి.