సందీప్ కిషన్ కుర్ర హీరోల్లో మంచి జోష్ ఉన్న కథానాయకుడు. స్నేహగీతం, ప్రస్థానం సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి రొటీన్ లవ్ స్టొరీ సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. అయితే తాను నటించిన సినిమాలు హిట్ అయ్యి తనతో నటించిన భామలు స్టార్ రేంజ్ కు వెళ్తున్నా సందీప్ కిషన్ మాత్రం ఎప్పటిలానే ఉన్నాడు. కథల విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటున్న ఈ యువ హీరో తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు.
సందీప్ తో నటించిన కథానాయికలు మాత్రం డైరెక్ట్ గా స్టార్స్ తో నటించే అవకాశాలు కొట్టేస్తున్నారు. రొటీన్ లవ్ స్టోరీ సినిమాలో తనతో నటించిన రెజినా ఇప్పుడు దాదాపు స్టార్ హీరోలతో చేయకపోయినా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సందీప్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన రకుల్ అయితే ఏకంగా టాలీవుడ్ ట్రెండింగ్ హీరోస్ తో జతకట్టే రేంజ్ కు వెళ్లింది. ఇక 2014లో వచ్చిన బీరువా సినిమాలో తనతో నటించిన సురభి ఇప్పుడు స్టార్స్ తో నటించేందుకు రెడీ అవుతుంది. ఈ మధ్యనే ఎక్స్ ప్రెస్ రాజా అంటూ హిట్ కొట్టిన సురభి తర్వాత సినిమా పూరి దర్శకత్వంలో నటించబోతుందని టాక్.
తనతో నటించిన భామలంతా రేసు గుర్రాల్లా దూసుకెళ్తుంటే తను మాత్రం సంవత్సరానికి ఓ సినిమా తీస్తూ ఇంకా ఎప్పటిలానే ఉన్నాడు. మరి ఇప్పటికైనా సందీప్ రూట్ మార్చి తన కథానాయికల మాదిరి సూపర్ హిట్స్ కొడితే మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ సెంటిమెంట్ గుర్తించిన కొద్దిమంది హీరోయిన్స్ కెరియర్ స్టార్టింగ్ లో సందీప్ తో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట.