సినిమా తీయడం కాదు. సరిగ్గా మార్కెటింగ్ చేసుకోవడం తెలిసి ఉండాలి. విడుదలకు ముందు డిజిటల్ రైట్స్ ని అమ్ముకోగలిగితే… ఆ సినిమా దాదాపుగా గట్టెక్కేసినట్టే. ఈ విషయంలో యువ నిర్మాత రాజేష్ దండా కాస్త తెలివిగా ఆలోచిస్తున్నారు. ఆయన చేపట్టే ప్రాజెక్టులన్నీ దాదాపుగా ప్రాఫిట్ తెచ్చినవే. రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్లో ఉండేలా ప్లాన్ చేస్తూ, సినిమాలు తీస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘మజాకా’ కూడా ఇప్పుడు సేఫ్ జోన్ లో పడిపోయింది.
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మజాకా’. రావు రమేష్ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరిలో విడుదల అవుతోంది. జీ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకొంది. దాదాపు రూ.20 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. జీతో ముందే డీల్ అయిపోయిందని, ఆ తరవాతే.. ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లారని తెలుస్తోంది. సినిమాకు దాదాపుగా రూ.33 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందని టాక్. అంటే మరో రూ.13 కోట్లు తెచ్చుకొంటే చాలు. ఈ రోజుల్లో మీడియం రేంజ్ సినిమాలకు హిట్ టాక్ వస్తే, వసూళ్లు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ‘మజాకా’ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో.. టాక్ బాగుంటే బాక్సాఫీసు దగ్గర గట్టి సౌండే చేస్తుంది. ఎలా చూసుకొన్నా రాజేష్ దండాకు ఇది ప్రాఫిట్‌బుల్ వెంచరే. సందీప్ కిషన్ గత చిత్రం `భైరవకోన` తీసింది కూడా రాజేష్ దండానే. ఆ సినిమానీ విడుదలకు ముందే అమ్మేసి లాభాల బాట పట్టారు. ఇప్పుడు ‘మజాకా’ వంతు వచ్చింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలెడతారు.