సందీప్ కిషన్ – త్రినాథరావు నక్కిన కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీనికి ‘మజాకా’ అనే పేరు పరిశీలిస్తున్నారు. రావు రమేష్ కీలక పాత్రధారి. 2025 సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఒక్క టీజర్ గానీ, పోస్టర్ కానీ రాలేదు. కనీసం టైటిల్ కూడా ఖరారు చేయలేదు. అయినా శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి.
శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూ.15 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.2.5 కోట్లకు, హిందీ రైట్స్ రూ.4.5 కోట్లకు నిర్మాత ముందే అమ్మేశారు. మొత్తంగా చూస్తే రూ.23 కోట్లకు లెక్క తేలింది. ఇక థియేట్రికల్ రైట్స్ మిగిలి ఉన్నాయి. ‘ధమాకా’ తరవాత త్రినాథరావు నుంచి వస్తున్న సినిమా ఇది. ‘ధమాకా’ రూ.100 కోట్లు కొట్టింది. అది ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పైగా త్రినాథరావు సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా కామెడీ చిత్రాలకు ఈమధ్య మంచి మార్కెట్ ఉంది. కాస్త బాగా ఆడినా.. థియేటర్లకు జనం వస్తున్నారు. అవన్నీ ఈ సినిమాకు కలిసి వచ్చాయి. కాకపోతే సంక్రాంతి సీజన్లో రావడం ఒక్కటే.. కాస్త టెన్షన్ పెట్టే విషయం. చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో ఈ సినిమా పోటీ పడాల్సివుంటుంది.