ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో విరూపాక్ష గుర్తుండిపోయే విజయాన్ని అందుకొంది. ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలు అయినా.. ఎక్కడా వసూళ్లు తగ్గలేదు. ఈ సినిమాతో హారర్, థ్రిల్లర్ చిత్రాలకు మరింత ఊపు వచ్చింది.
ఇప్పుడు… ఊరుపేరు భైరవకోన అనే మరో సినిమా రూపుదిద్దుకొంది. సందీప్ కిషన్ హీరో. టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూస్తే.. విరూపాక్ష గుర్తొస్తోంది. రెండు కథలూ వేరు. కానీ లక్షణాలు మాత్రం అవే. ఈ రెండు సినిమాల్లోనూ ఉమ్మడి అంశాలు చాలా కనిపిస్తున్నాయి. విరూపాక్ష ఓ మిస్టీరియస్ విలేజ్లో జరిగే కథ. భైరవకోన కూడా అంతే. భైరవకోన అనే ఓ ఊర్లో.. జరిగే డ్రామా. రెండు చోట్లా.. వింతలూ విడ్డూరాలు జరుగుతుంటాయి. భైరవకూన గరుడ పురాణం పుస్తక నేపథ్యంలో జరిగే కథ. అందులో మిస్సయిన నాలుగు పేజీలకూ ఈ ఊరికీ సంబంధం ఉంది. విరూపాక్ష కూడా ఇంచుమించుగా అంతే. ఆ సినిమాతో ఓ పుస్తకం సైతం.. కీలక పాత్ర పోషించింది. ఆ పుస్తకంలో ఊరు కట్టుబాట్లు రాసుంటాయి. కథకి మలుపు తిప్పే పుస్తకం అది. సోషియో ఫాంటసీ ఎడ్వంచరస్ థ్రిల్లర్ గా భైరవ కూన రూపుదిద్దుకొంది. రెండు సినిమాల్లోనూ మాయలు, మంత్రాలూ పుష్కలంగా కనిపిస్తున్నాయి. రెండు కథలూ వేర్వేరు కావొచ్చు. కానీ సెటప్ మాత్రం ఒక్కటిలానే కనిపిస్తోంది. సందీప్ కిషన్ హిట్టు కొట్టి చాలా రోజులైంది. కానీ.. ఈ టీజర్లో మాత్రం హిట్టు లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విరూపాక్ష మూడ్ లో ఉన్న సినీ జనాలకు ఈ సినిమా ఎక్కేస్తుందేమో చూడాలి.