సినిమాకి పబ్లిసిటీ చాలా అవసరం. మంచి సినిమా తీశాం.. కొత్త సినిమా తీశాం.. అని చెప్పుకోవడంలో తప్పు లేదు. చెప్పకపోవడమే తప్పు. అయితే… ఆ మాటలు శృతిమించితే ప్రమాదమే. సందీప్ కిషన్ కూడా ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకొంటే మంచిది. కొత్త కొత్త కాన్సెప్టులతో విభిన్నమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నాడు సందీప్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి కమర్షియల్ హిట్ కూడా మనోడి ఖాతాలో ఉంది. టైగర్ కూడా మంచి ప్రయత్నమే. రన్ నిరాశ పరిచింది. ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప ఇంకా ఘోరం.
ఈ సినిమా ప్రమోషన్లలో ఒక్క అమ్మాయి తప్ప గురించి చాలా గొప్పగాచెప్పాడు సందీప్ కిషన్. మేం హిట్ సినిమా చేయలేదు.. ఓ గొప్ప సినిమా తీశాం… అని చెప్పుకొన్నాడు. గొప్ప సినిమా అనేసరికి నిజంగా అదెంత గొప్పగా ఉంటుందో అనుకొన్నారు సినిమా ఫ్యాన్స్. కానీ.. అది కాస్త చప్పగా తయారైంది. రన్ సమయంలోనూ ఇంతే. అసలు ఇలాంటి సినిమాలో నటించడం నా అదృష్టం అన్నాడు. తీరా ఆ సినిమా రిలీజ్ అయ్యాక.. పొరపాటు జరిగిపోయింది అని ఒప్పుకొన్నాడు. మరి ఒక అమ్మాయి తప్ప సినిమా విషయంలో జరిగిన తప్పుల్ని ఎప్పుడు తెలుసుకొంటాడో?!