ఈరోజుల్లో చిన్న సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి వెళ్లిపోయిందంటే.. అదే పెద్ద విజయం. ఓటీటీ, డిజిటల్ రైట్స్ ఆగిపోయిన వేళ.. అది మరింత గొప్ప విషయం. ఇదంతా ఎందుకంటే.. సందీప్ కిషన్ సినిమా ‘ఊరి పేరు భైరవ కోన’ విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాపై ఏకంగా రూ.27 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాత రాజేష్ దండా. ఆయన గత చిత్రం ‘సామజవరగమన’ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. లాభాల్నీ తెచ్చిపెట్టింది. అదే నమ్మకంతో సందీప్ పై రూ.27 కోట్లు పెట్టారు.
సందీప్ కి ఈమధ్య హిట్లు లేవు. తన మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే.. ఈ సినిమా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ నాన్ థియేట్రికల్ రైట్స్ ని రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. థియేట్రికల్ హక్కుల్ని రూ.14 కోట్లకు వీ 3 ఎంటర్టైన్మెంట్స్ చేజిక్కించుకొంది. అలా.. విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ అయిపోయింది. దర్శకుడు వీఐ ఆనంద్ పై ఉన్న నమ్మకం, ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అవ్వడం, టీజర్ కూడా ప్రామిసింగ్ గా కనిపించడంతో.. ఈ సినిమాపై దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ రోజున ‘ఈగల్’, ‘లాల్ సలామ్’ విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలకూ ‘భైరవకోన’ ఏమేరకు పోటీ ఇస్తుందో చూడాలి.