వరుస ఫ్లాపుల నుంచి తేరుకోవడానికి సందీప్ కిషన్ చాలానే కష్టపడుతున్నాడు. తన కొత్త సినిమా ‘నిను వీడని నీడని నేనే’కి భారీ ఎత్తున ప్రమోషన్లు కల్పిస్తున్నాడు. ఈ సినిమాపై బాగా నమ్మకంగానూ కనిపిస్తున్నాడు. వ్యాపార పరంగానూ ఈ సినిమా సందీప్‌లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ఓవర్సీస్, నైజాం తప్ప మిగిలిన ఏరియాలన్నీ మంచి రేట్లకే అమ్ముడయ్యాయి. ఇప్పుడు హిందీ రీమేక్ రైట్స్ రూపంలో కూడా డబ్బులొచ్చాయి. “హిందీలో ఈ సినిమాని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది. ఆ సినిమాలో మాత్రం నేను నటించడం లేదు” అని సందీప్ కిషన్ తెలిపారు.
“ఈమధ్య తెలుగు సినిమాలపై హిందీ నిర్మాతల దృష్టి పడింది. కాకపోతే వాళ్లకు చాలా కండీషన్లు ఉంటాయి. సినిమా ఎంత బాగా తీసినా.. ఇక్కడ బాలేదు, అక్కడ మార్చాలి అంటూ కొన్ని సవరణలు చెబుతుంటారు. కానీ.. `నిను వీడని నీడను నేనే` చూశాక అలాంటి మాట ఒక్కటీ మాట్లాడ లేదు. హిందీలో మేం ఈ సినిమా చేస్తున్నాం అని ఎగ్రిమెంట్లపై సంతకాలు చేశారు. దాంతో ఈ సినిమాపై నాకు మరింత నమ్మకం పెరిగింది” అని చెప్పుకొచ్చాడు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.