అమెరికా అధ్యక్ష ఎన్నికలకి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికయిన డోనాల్డ్ ట్రంప్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో కలకలం సృష్టించుతున్నాయి. అమెరికాలోకి ముస్లింలను ప్రవేశించనీయకూడదని, ఇప్పటికే దేశంలో వారి వివరాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా ఒక సర్వే చేపట్టాలని ఆయన అన్నారు. అమెరికాలో మెజార్టీ ప్రజలు ఆయనతో విభేదించారు. వారిలో ఫేస్ బుక్ సీ.ఈ.ఓ. మార్క్ జూకర్ బెర్గ్, గుగూల్ సీ.ఈ.ఓ. సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.
మత అసహనంపై సుందర్ పిచాయ్ ఈవిధంగా అన్నారు. “మన విలువలని మన భయం కారణంగా వదులుకోకూడదు. నేను అమెరికాకి వచ్చి 22 ఏళ్ళయింది. ఇన్నేళ్ళలో ఏనాడూ ఇది నాకు పరాయిదేశమనే భావనే కలుగలేదు. నా మాతృ దేశమయిన భారత్ లో ఉన్నప్పుడు నాకు ఎలాగ అనిపిస్తుందో ఇక్కడా నాకు అటువంటి భావనే పొందుతుంటాను. అమెరికా అంటే వలసవాదుల దేశం. అమెరికా అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. అమెరికా అంటే స్వేచ్చా…స్వాతంత్రం. ఇక్కడ సంకుచితభావాలకు చోటు లేదు. అమెరికా అంటే ‘ఓపెన్ మైండ్’ తో ఆలోచించే దేశమని గుర్తింపు కలిగిఉంది. ఈ దేశం అందరికీ తమ కలలను సాకారం చేసుకొనే అవకాశం కల్పిస్తుంది.
“ఒక దేశం లేదా ఒక మతానికి చెందిన ప్రజల అభిప్రాయాలను, వారి తెలివితేటలను, దేశాభివృద్ధిలో వారి పాత్రని మరిచిపోయి కేవలం వారి మతాన్ని, ప్రాంతాలని మాత్రమే చూడటం చాలా బాధ కలిగిస్తుంది. వారి గురించి మీడియాలో కొందరు చెపుతున్న మాటలు వింటునప్పుడు మనసుకి చాలా కష్టం అనిపిస్తోంది.”
“మా గూగుల్ సంస్థ అనేక దేశాలు, మతాలు, భిన్నాభిప్రాయాలు, భిన్నమయిన ఆలోచన, దృక్పధాలు కలిగిన వారికి ఒక వేదిక వంటిది. ఆ భిన్నత్వమే మా గూగల్ సంస్థకు ఒక ప్రత్యేకతను ఏర్పరిచింది. అటువంటి విభిన్నమయిన వ్యక్తులు అందరం కలిసి ఆలోచించి పని చేస్తునందునే మేము గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించగలిగాము. ఇంకా విభిన్నమయిన లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగిపోతున్నాము.”
“భిన్నాభిప్రాయాలు, విభిన్నమయిన ఆలోచనలను, లోతయిన చర్చలను స్వాగతించగలిగినపుడే ఒక సంస్థ అయినా దేశమయినా అభివృద్ధి చెందగలదు. అప్పుడే అత్యుత్తమ ఆలోచనలు, నిర్ణయాలు, ఫలితాలు వస్తాయి. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది. మత అసహనం పెరిగితే అందరూ కలిసి దానిని నిలువరించే ప్రయత్నం చేయాలి. మెజార్టీ వర్గం చెప్పిందే సరయినదనుకొంటే మిగిలినవారి ఆలోచనలు, అభిప్రాయలు అందులో కనబడవు..అందరి అభిప్రాయలకు అందులో చోటు కల్పించినపుడే దానికి ఒక విలువ ఏర్పడుతుంది. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ తన భావాలను వ్యక్తీకరించుకొనే స్వేచ్చ కలిగి ఉండాలి.” అని అన్నారు సుందర్ పిచాయ్.