తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా ఏడుస్తాడు..దెబ్బతగిలిన బిడ్డ అమ్మా అని ఇంకోలా ఏడుస్తాడు అని మన శంకరాభరణం శంకరశాస్త్రి చెప్పనే చెప్పారు. అదే విధంగా త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ ఒకలా వుంటుంది. మారుతి సినిమాలో ఫన్ ఇంకోలా వుంటుంది. అల్లరి నరేష్ సినిమాల అల్లరి వేరుగా వుంటుంది. డైరక్టర్ ను బట్టి కథ, కథను బట్టి కామెడీ స్టయిల్ అన్నమాట. ఈ చిన్న లాజిక్ మరిచిపోయి, ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ పండించాల్సిన మూవీని తీసుకుని, అల్లరి నరేష్ సినిమాకు తక్కవ, ఆలీ సినిమాకు ఎక్కువ అన్న టైపులో తీస్తే, ఇదిగో అచ్చం ఇలాగే టూ కంట్రీస్ మాదిరిగా వుంటుంది.
మలయాళంలో హిట్ అయిన టూ కంట్రీస్ సినిమాకు తెలుగు వెర్షన్ హీరో సునీల్, డైరక్టర్ శంకర్ కలిసి చేసిన అనువాదమే టూ కంట్రీస్. హీరోగా గజనీ దండయాత్రలు సాగిస్తున్నకమెడియన్ సునీల్ మరో యత్నం ఇది. ఈసారి చేసిన ప్రయత్నం కథేంటంటే..
కథ
ఉల్లాస్ (సునీల్) అచ్చంగా అల్లరి నరేష్ లాంటి వ్యవహారం. అప్పటికప్పుడు ఏదో ఎత్తువేసి పబ్బం గడుపుకోవడం మినహా మరో పని వుండదు. విదేశాల్ల స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి లయ (మనీష). తల్లి మొదటి భర్తను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఫ్రస్టేట్ అయి మందుకు బానిస అవుతుంది లయ. పెళ్లి చేస్తే సెట్ అవుతుందేమో? అని ఉల్లాస్ తో అనుకోకుండా సంబంధం కలుపుకుంటారు లయ పేరెంట్స్. పెళ్లయ్యాక అసలు విషయం తెలుస్తుంది. అయినా డబ్బు యావతో సర్దుకుపోదాం అనుకుంటాడు ముందు. కానీ తరువాత తరువాత లయను ప్రేమించి, మార్చుకునే పనిలో పడతాడు. కానీ అప్పటికే లయ విడాకులు కోరుకుంటుంది. అప్పుడేం జరిగిందన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ
టూ కంట్రీస్ కథ జోనర్ ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు దర్శకుడు శంకర్, రచయిత సీపాన శ్రీధర్, హీరో సునీల్. ఈ ముగ్గురు కలిసి, ఈ కథను డైల్యూట్ చేసేసి, చాలా సాదా సీదా కామెడీ కథగా మార్చేసారు. నిజానికి అమెరికాలో విచ్ఛిన్నమయ్యే కుటుంబాలు, వాటి కారణంగా పిల్లలు ఎదుర్కొనే సమస్యలు లాంటి మాంచి ఫ్యామిలీ పాయింట్లు వున్నాయి. సినిమా తొలి సగాన్ని కాస్త మంచి ఫన్ తోనూ, మలి సగాన్ని డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానూ తీసుకుని వుండే అవకాశం వుంది.
కానీ రచయిత సీపాన శ్రీధర్ సినిమా మొత్తాన్ని ఒకే గాట కట్టేసాడు. అక్కర్లేని ప్రాసలు, అర్థం పర్థం లేని పంచ్ లు వేసి, ఇదే కామెడీ అంటే, దీనికే మీరు నవ్వుకోవాలి అని స్క్రిప్ట్ అందించాడు. దర్శకుడు శంకర్ కూడా హీరోగా సునీల్ ను పెట్టుకున్నాం, అతని నుంచి జనాలకు కావాల్సింది కామెడీనే అని ఫిక్సయిపోయి, సినిమాను తయారుచేసాడు.దాంతో సినిమా ఏదో ఓ సాదా సీదా సి సెంటర్ కామెడీ సినిమాగా తయారైంది తప్ప, మంచి సినిమాగా మారలేకపోయింది. బహుశా సునీల్ ను హీరోగా తీసుకోకుండా వుంటే, దర్శక,రచయితల దృక్కోణం వేరే విధంగా వుండి వుండేదేమో?
సినిమా ఎత్తుగడే గందరగోళంగా మొదలవుతుంది. హీరో సునీల్, అతని పక్కన వుండే శ్రీనివాసరెడ్డి, వీళ్లకు అప్పిచ్చిన షియాజీ షిండే, అతని కొలువులో వుండే జబర్దస్త్ బ్యాచ్ అంతా కలిసి, ఎవరి వచ్చిన, ఎవరికి తోచిన కామెడీ వాళ్లు చేసేస్తుంటారు. స్క్రిప్ట్ దశలో దర్శక, రచయితలు ఇవన్నీ తలుచుకుని, ‘పోలా..అదిరిపోలా..’ అని అనుకుంటే వుంటే వుండొచ్చు. కానీ అవి స్క్రీన్ మీదకు వచ్చేసరికి ‘పోలా..కంగాళీ అయిపోలా’ అన్నట్లు తయారైంది. తోలిసగంలో దాదాపు సీన్లన్నీ లాజిక్ లెస్ గా , సి సెంటర్ కామెడీగా వుంటాయి. కీలకమైన కొన్ని సీన్లు కూడా రిజిస్టర్ అయ్యేలా తీయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ను కూడా సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయాడు.
ద్వితీయార్థం లో హీరోయిన్ ఇంటి వ్యవహారాలు కీలకమైనవి. ఎందుకు హీరోయిన్ అలా అయ్యింది అన్న విషయంలో సింపతీ జనరేట్ కావాలి. కానీ స్టెప్ మదర్, స్టెప్ డాడీ అంటూ నవ్వురాని వినోదం పండించాలని చూసారు. అన్నింటికి మించి విదేశాల్లో తెలుగు యాస అంటూ సీనియర్ నరేష్, మిగిలిన వారి నుంచి వెగటు పుట్టించే స్లాంట్ లో మాట్లాడించేసారు. కీలకమైన క్లయిమాక్స్ కోర్టు సీన్లో అయినా హీరో చేత కాస్త హార్ట్ టచింగ్ మాటలు నాలుగు మాట్లాడించే ప్రయత్నం చేయకుండా, నవ్వులకే ఓటేసారు. దాంతో సినిమాలో వున్న సోల్ మిస్ అయింది.
ఈ సినిమా ఇలా తయారు కావడానికి ప్రధాన ముద్దాయిలు ఇద్దరే. ఒకరు రచయిత రెండవది దర్శకుడు. ఆ తరువాత హీరో సునీల్ వాటా కూడా కొంత వుంది.
నటీనటులు
టూ కంట్రీస్ సినిమాను సునీల్ ఒకటికి రెండు సార్లు చూసుకోవడం అవసరం. ఇంకా తను హీరోగా వేషాలు వేయడానికి పనికి వస్తాను అనుకుంటే అతని ఇష్టం. కొత్త కథనాయిక మనీషా క్యూట్ గా వుంది. తెలుగు తెరకు కథానాయికల కొరత చాలా వుంది కాబట్టి, కాస్త కృషి చేస్తే కొన్ని సినిమాలయినా చేసుకునే చాన్స్ వుంది. శ్రీనివాసరెడ్డి ఓకె. మిగిలిన వారంతా గోల గోల. జబర్దస్త్ ఆర్టిస్ట్ ల గోల మామూలే.
సాంకేతికత
సినిమా టెక్నకల్ గా రిచ్ గానే వుంది. గోపీసుందర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్, రెండు పాటలు ఓకె. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ,విదేశీలొకేషన్లు కలర్ ఫుల్ గానే వున్నాయి. సీపాన శ్రీధర్ మాటలు ఒకటి రెండు చోట్ల నవ్వులు పండించాయి, చాలా చోట్ల చికాకు కలిగించాయి.
ఫైనల్ టచ్…కా’మిడి మిడి’ సినిమా
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5