హిట్టు కోసం అరివీర భయంకరంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న హీరోల్లో సునీల్ ఒకడు. పాపం.. ఇంగ్లీషు డీవీడీలన్నీ అరగ్గొట్టేసి, పాత సినిమాలన్నీ మిక్సీలో వేసి, ఫేస్ బుక్ జోకులన్నీ కలగలిపి, వాట్సప్ వినోదం ఎక్ట్స్ట్రా కోటింగుగా వేసినా సరే.. ఫలితం రావట్లేదు. సునీల్ సినిమాలో అన్నీ ఉన్నాయ్ గానీ… ఏదో మిస్సయ్యింది అన్న ఫీలింగ్ కలుగుతోంది. ప్రతీ సినిమా విడుదలకు ముందు ‘అసలు ఈ సినిమా సూపర్ హిట్టవ్వకపోతే ప్రపంచం తల్లకిందులైపోతుంది’ అన్నట్టు మాట్లాడే సునీల్.. విడుదలయ్యాక, టాక్ బయటకు వచ్చాక, ఫ్లాప్ అని తేలిపోయాక.. ‘ఆ.. మీకు చూడ్డం రాదెహే…’ అంటూ సెటైర్లు వేయడం విడ్డూరంగా మారుతోంది.
ఈడు గోల్డు కాదు, రోల్డు గోల్డు అంటూ ఆ సినిమాపై వేయాల్సినన్ని సెటైర్లు వేసేశారంతా. రివ్యూలు కూడా చడామడా తిట్టిపోశాయి. దాంతో సునీల్ రివ్యూలపై, అవి రాసేవాళ్లపైనా గుస్సాగా ఉన్నాడట. నిజానికి ఈడు గోల్డెహె విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ”నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలకు రివ్యూలు సరిగా రాలేదు. రెవిన్యూ బాగా వచ్చింది. ఈ సినిమాకి రివ్యూలు కూడా బాగా వస్తాయి. వాళ్లకోసం తీసిన సినిమా ఇది” అంటూ డబ్బా కొట్టాడు. మరోవైపు వీరూ పోట్ల కూడా అదేమాట చెప్పాడు. ”రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన విమర్శకులకు సైతం ఈ సినిమా బాగా నచ్చుతుంది” అన్నాడు. నిజమో కామోసు అనుకొని థియేటర్లలోకి వెళ్తే.. ఈడు గోల్డెహె.. ఎళ్లెలెహె అనేంతగా భయపెట్టింది. రివ్యూల మాట అటుంచితే రెవిన్యూ కూడా కరవైంది. సేమ్ టైమ్ ప్రేమమ్కి మంచి రివ్యూలు రావడంతో ఆ సినిమాకి వసూళ్లు పెరిగాయి. రివ్యూల వల్ల తన సినిమా మరోసారి డల్లయిపోయిందని సునీల్ తెగ ఇదైపోతున్నాడట.
”అసలు రివ్యూల ఉపయోగం ఏమిటి? ఎందుకోసం? రివ్యూల వల్లే సినిమాలకు నష్టమే” అంటూ రివ్యూలపై తానే ఓ రివ్యూ ఇస్తున్నాడట తన క్లోజ్ సర్కిల్స్ దగ్గర. మంచి సినిమాలు తీస్తే.. ప్రేక్షకులే కాదు, సమీక్షకులు హర్షిస్తారు. ఎప్పుడూ రొడ్డకొట్టుడు సినిమాలు తీస్తే లాభం ఎవరికి? ఓ మంచి ప్రయత్నం చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ విషయాన్ని సునీల్ గుర్తించాలి. రివ్యూల కోసమో, రెవిన్యూల కోసమో సినిమా తీయకూడదు. కథని నమ్మి.. దాని కోసం సినిమా తీయాలి. అప్పుడు రివ్యూలూ బాగుంటాయి. రెవిన్యూ కూడా వస్తుంది. మరి ఈ నిజాన్ని మర్యాద రామన్న ఎప్పుడు తెలుసుకొంటాడో?