‘సొంతం’లో శేషం… ‘అందరివాడు’లో సత్తిబాబు… ‘ఢీ’లో కత్తి… ‘రెడీ’లో జానకి… కమెడియన్‌గా సునీల్‌కి దర్శకుడు శ్రీనువైట్ల ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఫన్టాస్టిక్ అనడం కరెక్ట్ ఏమో! అదంతా గతం… మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు చేసి, మళ్లీ కమెడియన్‌గా టర్న్ అయిన సునీల్ నికార్సయిన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ‘అల్లరి’ నరేష్‌తో కలిసి నటించిన ‘సిల్లీ ఫెలోస్’తో సునీల్ ఆశ నెరవేరలేదు. క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా కమెడియన్‌గా సునీల్ విశ్వరూపాన్ని ‘అరవింద సమేత’లో ఆవిష్కరించలేదు. తను ‘అరవింద’లో మంచి పాత్ర చేశానని, తను సినిమాలో కామెడీ చేసుంటే బాలేదని ప్రేక్షకులు అనేవారని, సినిమాలో తను నటించిన మూడు సన్నివేశాలకు త్రివిక్రమ్ కత్తెర వేశాడని సునీల్ అన్నాడు.
ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో అయినా సునీల్ ఆశ నెరవేరుతుందేమో చూడాలి. సునీల్ కోసం దర్శకుడు శ్రీను వైట్ల ఫెంటాస్టిక్ క్యారెక్టర్ రాశాడట! రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో బాబీ పాత్రలో సునీల్ నటించాడు. శనివారం రాత్రి జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో ‘బాబీ… అప్పులు చేయడం అతని హాబీ’ అని సునీల్ క్యారెక్టర్ గురించి సుమ చేత రెండు ముక్కలు చెప్పించారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘దుబాయ్ శీను’లో సునీల్ నవ్వించాడు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో ఎంత నవ్వించాడో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఎదురు చూడక తప్పదు.