గత కొద్ది రోజులుగా, ఉద్దేశపూర్వకంగా, జగన్ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరబోతున్నాడని అసత్య కథనాలు వండి వార్చిన జగన్ అనుకూల మీడియాకి బీజేపీ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నటువంటి సునీల్ దియోధర్ కర్రు కాల్చి వాత పెట్టాడు. అవినీతి తో నిండిపోయిన వైఎస్ఆర్సిపి తో తమకు ఎటువంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రయాణం జనసేన పార్టీ తోనే అని నిర్ధారణ చేసి, జగన్ పార్టీ ఎన్డీయేలో చేరబోతోంది అంటూ వచ్చిన వార్తల గాలి తీసేసి, జగన్ మీడియాను జోకర్ చేసేసాడు. వివరాల్లోకి వెళితే..
జగన్ భజన మీడియా ఓవరాక్షన్:
మోడీ తో జగన్ భేటీ కాబోతున్నాడు, ఎన్డీయేలో చేరమని మోడీ జగన్ ని కోర బోతున్నాడు, ఒకవేళ జగన్ విశాల హృదయంతో మోడీ కోరికను మన్నించితే, విపక్షాల పరిస్థితి ఏం కాను, బిజెపి ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ జోకర్ అయిపోయినట్లేనా, ఎన్నికల నాటికి బిజెపిలో చేరాలనుకుంటున్న తెలుగుదేశం ఆశలు అడియాశలు అయినట్లేనా ? ఒకవేళ జగన్ గనుక కేంద్ర ప్రభుత్వం లో చేరితే కేబినెట్ ర్యాంకు విజయసాయిరెడ్డికి ఖాయం అయిపోయినట్లేనా? ఇంకా ఏ ఎంపీలకు ఏ పదవులు రాబోతున్నాయి? – ఇవి గత మూడు నాలుగు రోజులుగా జగన్ నీ మోసే మీడియా వండి వార్చిన వార్తలు. జగన్ తుమ్మితే చాణక్యత తో తుమ్మాడని, దగ్గితే ప్రజా సంక్షేమం కోసమే గ్రేట్ గా దగ్గాడని, గాసిప్పులు వండి వార్చే వెబ్సైట్లు అయితే ఈ దెబ్బకి జనసేన పార్టీ జోకర్ అయిపోయిందని పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసుకొచ్చాయి.
రాష్ట్రాల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముఖ్య మంత్రులతో సమావేశం
కరోనా కారణంగా ముఖ్యమంత్రులతో ఇటీవలి కాలంలో నేరుగా సమావేశం కాని ప్రధానమంత్రి, ఇప్పుడు పెండింగ్ అపాయింట్ మెంట్ లు అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పుడు కలుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముందుగా ఉన్న కారణంగా జగన్ కి అపాయింట్మెంట్ ముందుగా వచ్చిందని, అక్టోబర్ రెండవ మూడవ వారాల్లో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మోడీ కలవబోతున్నారని సమాచారం.
విషయం తెలిసి కూడా మైండ్ గేమ్ కు తెరలేపిన వైకాపా
అయితే ఇది కేవలం లాంఛనప్రాయమైన సమావేశం అని తెలిసినప్పటికీ వైఎస్ఆర్సిపి మైండ్ గేమ్ కు తెరలేపినట్లు అర్థం అవుతుంది. మోడీతో భేటీ ఖాయం కాగానే, కేంద్ర మంత్రివర్గంలోకి చేరబోతున్నారు అంటూ ఉద్దేశపూర్వకంగా రూమర్స్ సృష్టించి తమ అనుకూల మీడియా ద్వారా వాటిని వ్యాప్తి చేయించినట్లు అర్థమవుతోంది. తీరా విషయం బయట పడే సమయానికి, ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రమంత్రి ప్రభుత్వంలో లో చేరతామని షరతులు పెట్టినట్లు ప్రచారం చేయించుకుంది. భవిష్యత్తు లో ప్రత్యేక హోదా కోసం తాము కేంద్ర మంత్రి పదవులను సైతం త్యాగం చేశామని చెప్పుకోవడానికి ఈ హంగామా అంతా పనికి వస్తుందని ఆ పార్టీ భావించింది. అయితే మోడీ పిలిచి పదవి ఇస్తానంటే జగన్ వద్దన్నాడు అంటే నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు. అందులోనూ ఎవరైనా ఏ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాల కోసమే పెడతారు ముఖ్యమంత్రి కావడానికే జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు అని నిర్మొహమాటంగా చెప్పుకునే వైఎస్సార్సీపీ నాయకులు, ఆయన మీడియా కారణంగా జగన్ కేంద్ర మంత్రి పదవులను తిరస్కరించారు అని వైఎస్ఆర్సిపి భజన మీడియా ఎంత చెప్పినా ప్రజలు నమ్మలేకపోతున్నారు.
మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం లో, జగన్ అనుకూల మీడియా జోకర్ ఐపోయినట్టుగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డికి కేంద్ర కేబినెట్ ర్యాంకు అని, పలానా ఎంపీకి ఫలానా శాఖ అని డప్పు కొట్టుకున్న జగన్ భజన మీడియా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కవర్ చేయడానికి ఇంకే కొత్తరకమైన కథనాలు వండుతుందో వేచి చూడాలి