కన్నా లక్ష్మినారాయణను సీరియస్గా తీసుకోవడం లేదని బీజేపీ ఏపీ వ్యవహారాల కో ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ఢిల్లీలో ప్రకటించారు. ఆయన కామెంట్స్ పై సోము వీర్రాజు స్పందించారని ఆయన చెబుతున్నారు. సోము వీర్రాజు ఏం స్పందించారంటే.. కన్నా లక్ష్మినారాయణ మా పార్టీలో పెద్దలు. ఆయన కామెంట్లపై స్పందించను అన్నారు. కాస్త వెటకారంగా చేసిన సోము వీర్రాజు స్పందననే.. సునీల్ ధియోధర్.. బీజేపీ హైకమాండ్ స్పందన అన్నట్లుగా ఢిల్లీలో ప్రకటించారు. అంటే.. కన్నాను ఉంటే ఉండు..పోతే పో అని సంకేతాలు ఇచ్చినట్లయింది.
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలనుకున్న కన్నా .. అన్నీ రెడీ చేసుకున్నారు. అమిత్ షా ఫోన్ చేశారని.. గుండె నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరి .. పార్టీ మారకుండా తప్పించుకున్నారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి వచ్చింది. కన్నా చేసిందేమీ లేకపోయే సరికి..బీజేపీ వాళ్లే వదిలించుకోవాలనుకుంటున్నారు. పైగా ఆయనపై విజయసాయిరెడ్డి లాంటి నేతలు.. ఎన్నికల సమయంలో నిధులు కొట్టేశారన్న ఆరోపణలు చేశారు. బీజేపీ లెక్కలు కూడా విజయసాయిరెడ్డి చూసినట్లుగానే ఆయన చెప్పారు. బీజేపీలోనూ అదే ప్రచారం జరిగింది.
ఇప్పుడు సోము వీర్రాజుపైనా కన్నా వర్గం అలాంటి తీవ్ర ఆరోపణలే చేస్తోంది. సునీల్ ధియోధర్.. జీవీఎల్ కలిసి పెద్ద ఎత్తున కూడబెట్టారని అంటున్నారు. అందుకే వారు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారని అంటున్నారు. కారణం ఏదైనా కన్నా ధిక్కరణను బీజేపీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారు. కన్నా ఇక తన ఇష్టం వచ్చిన పార్టీలో చేరవచ్చన్నట్లుగా సందేశం పంపారు. మరి కన్నా ఏ నిర్ణయం తీసుకుంటారో ?