సునీల్‌కి అసలే రోజులు బాలేవు. ఏం చేసినా కలసి రావడం లేదు. అతని హోప్స్ అన్నీ జక్కన్న సినిమాపైనే. డాన్సులు, కామెడీ, పంచ్‌లు, సెంటిమెంట్ సీన్లు, రొమాన్స్ ఇలా అన్నీ ఈ సినిమాలో పండించేశాడట సునీల్. దానికి తోడు చిరంజీవి కూడా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి.. సునీల్‌ని ఆశీర్వదించి వెళ్లాడు. సినిమా తయారై చాలా రోజులైనా, అన్ని విధాలా సంతృప్తి పడి.. మంచి ముహూర్తం చూసుకొని ఈనెల 22న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు సునీల్‌కి రజనీకాంత్ షాకిచ్చాడు. కబాలి కూడా ఈనెల 22నే వస్తోంది. సూపర్ స్టార్‌తో పోటీ పడడం మామూలు విషయం కాదు. పైగా కబాలిపై భారీ అంచనాలున్నాయి. తెలుగులో 30 కోట్లు ఇచ్చి ఈసినిమాని కొన్నారు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయడం ఖాయం.
జక్కన్న పై నమ్మకంతో కబాలిపై పోటీకి దిగాలని చూసినా… సునీల్‌కి కష్టాలు తప్పవు. ఎందుకంటే కావల్సిన సంఖ్యలో సునీల్ సినిమాకి థియేటర్లు దొరకవు. ఒకవేళ దొరికినా.. ప్రారంభ వసూళ్లు మాత్రం ఉండవు. కబాలికి నెగిటీవ్ టాక్ వచ్చి, ఆ ఆడియన్స్… జక్కన్న థియేటర్ల వరకూ టర్న్ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే. ఒకవేళ కబాలికి ఫస్ట్ డేనే సూపర్ టాక్ వస్తే.. జక్కన్న థియేటర్లో ఈగలు తోలుకోవడమే. అందుకే సునీల్ ఇప్పుడు భయపడుతున్నాడు. జక్కన్న ని వాయిదా వేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. అయితే.. ఆగస్టు 12న జనతా గ్యారేజీ వస్తోంది. అంతకు ముందు బాబు బంగారం, సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలు లైనులో ఉన్నాయి. 22 దాటితే.. సునీల్‌కి రిలీజ్ డేట్ దొరకడం కష్టం. మరో నెల రోజులైనా ఆగాలి.