తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పాత్ర చాలా ఎక్కువ. స్ట్రాటజిస్టుగా సునీల్ కనుగోలు..బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటకలో గెలిపించారు. ఆ తర్వాత తెలంగాణ బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా నాడి పడుతూ.. గెలుపు గుర్రాలైన అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ప్రచార వ్యూహాలను క్రియేటివ్ గా చేయడం వరకూ మొత్తం సునీల్ కనుగోలు చూసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలు.. దినపత్రికల్లో వచ్చిన ప్రకటనలు ఎంతో క్రియేటివ్ గా ఉన్నాయని చూసిన వారంతా మెచ్చుకున్నారు. అవన్నీ నిజాలేనని ఒక్కటీ అబద్దం లేదని కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేయగలిగింది.
కేవలం ప్రచారం మాత్రమే కాదు.. అసలైన పరిస్థితిని అంచనా వేస్తూ.. గెలుపు గుర్రాలైన అభ్యర్థులను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి.. బీఆర్ఎస్ ఆకర్ష్ దెబ్బకు బలహీనమైన కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచే లభించారు. తాండూరు లాంటి చోట్ల అప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతను తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇలాంటి వ్యూహాలతో సునీల్ కనుగోలు సక్సెస్ అయ్యారు. ఆరు గ్యారంటీలను డిజైన్ చేసి ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారు.
తెలంగాణలో పారిన సునల్ కనుగోలు వ్యూహాలు ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో ఎందుకు పారలేదన్నది చాలా మందికి వచ్చే డౌట్. అయితే అక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకులు అశోక్ గెహ్లాత్ , కమల్ నాథ్ వంటి వారు సునీల్ కనుగోలుకు హిందీ బెల్ట్ రాజకీయాల గురించి తెలియదని.. ఆయన సలహాలు సూచనలు పాటించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తమ కంటే పెద్ద స్ట్రాటజిస్టులు ఎవరు ఉంటారని వారు ఫీలయ్యారని.. పార్టీని బొంద పెట్టారని అంటున్నారు.