ఏపీలో అత్యంత వివాదాస్పదమైన పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్కు ప్రభుత్వం అప్రాధాన్య పోస్టు కేటాయిచింది. బదిలీ చేసిన తర్వాత ఆయన అమెరికా వెళ్లారు. డీజీపీగానే తిరిగి వస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆయనను తప్పించింది కానీ.. ఆయనకు డీజీపీ పోస్టు ఇచ్చే ఉద్దేశంలో ఉందని చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగానే రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించబోతున్నట్లుగా ప్రచారం చేశారు. చివరికి డీజీపీ కాదు కాదు… ప్రాధన్య పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించారు. ఓ సీనియర్ ఆఫీసర్ కు ఈ పోస్టింగ్ అప్రాధాన్య శాఖ.
డీజీపీగా నియమించేంత అభిమానం ఉంటే… ఆ పోస్టు కాకపోయినా… ఆ పోస్టుకు సమానమైన .. లేకపోతే గౌరవానికి ఏ మాత్రం తగ్గని పోస్టింగ్ ఇచ్చేవారు. అలాంటివేమీ లేకుండా అప్రాధాన్య పోస్టింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి సునీల్ కుమార్ ను ప్రభుత్వం వాడుకున్నంతగా ఏ ఇతర అధికారిని వాడుకోలేదు. ఆయన కూడా ప్రభుత్వం అండతో రెచ్చిపోయారు. ప్రైవేటు సైన్యం మాదిరిగా టీడీపీ నేతల ఇళ్లపై పడి అర్థరాత్రుళ్లు దాడులు చేయడం.. అరెస్టులు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ ఆయనను టీడీపీ టార్గెట్ చేసుకునేలా చేసింది.
ఇప్పుడు తమ తప్పేమీ లేదని వైసీపీ తప్పించుకుంటోంది. అంతా సునీల్ కుమారే చేశాడని.. తమ ప్రమేయం ఏమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఆయనను పక్కన పెట్టింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నుంచి ఒత్తిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్ నిండా మునిగినట్లుగానే కనిపిస్తున్నారు. అస్మదీయ ప్రభుత్వమే సమర్థించలేకపోతూంటే.. ఇక బాధలు పడిన వారు ప్రభుత్వంలోకి వస్తే సునీల్ కుమార్ పరిస్థితి ఏమవుతుంది ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.