సీఐజీ డీజీ సునీల్ కుమార్ పై ప్రభుత్వానికి కోపం వచ్చిందో లేకపోతే.. సీఐడీ దురాగతాలు ఢిల్లీ వరకూ చేరి.. ఆయనపై చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో కానీ.. సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఫైర్ సర్వీసెస్ డీజీకి అదనపు బాధ్యతలిచ్చారు. సునీల్ కుమార్కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ అంశం ఇప్పుడు ఏపీ పోలీసు శాఖలో సంచలనంగా మారింది.
జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీకి సునీల్ కుమార్ చీఫ్ గా ఉన్నారు. ఆయన హయాంలో.. సీఐడీ ప్రైవేటు సైన్యంలా మారిందన్న ఆరోపణలు వచ్చాయి. రాజకీయ దురుద్దేశ కేసుల కోసమే సీఐడీ పని చేస్తున్నట్లుగా ఇంత కాలం వ్యవహారం సాగింది. స్వయంగా సునీల్ కుమార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనకు చెందిన స్వచ్చంద సంస్థ మత మార్పిళ్లకు పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన చేసిన చట్ట వ్యతిరేక చర్యలపై కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి . వాటిపై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు రాష్ట్రానికి కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. కానీ ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం బయట ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ వేటు వేశారు.
విశాఖలో ఓ భూదందాలో సీఐడీ పోలీసులు జోక్యం చేసుకుని భూముల యజమానుల్ని పిలిచి బెదిరిచిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలాంటి ఆరోపణలు గత మూడున్నరేళ్ల నుంచి వస్తున్నాయి. ఈ ఆరోపణలతోనే చర్యలు తీసుకుని ఉండరని.. అంతర్గతంగా ఏదో జరిగి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదేమిటో కాస్త ఆలస్యంగా బయటకు వస్తుందంటున్నారు. అయితే ఇంత కాలం తనపై ఎన్ని విమర్శలు వచ్చినా… టీడీపీకి ప్రధాన టార్గెట్ గా మారేలా విధులు నిర్వహించినందున ఆయనను ప్రభుత్వం వదిలేయదని.. అలా చేస్తే అధికారుల్లోనే నమ్మకం పోతుందని అంటున్నారు.
సీఐడీ తీరు వల్ల వస్తున్న విమర్శలకు ఆయనను బలి చేసి ఉంటారు కానీ.. ఆయనకు మంచి పోస్టింగ్ ఇస్తారని భావిస్తున్నారు.