దళితుల్ని చంపి.. డోర్ డెలివరీలు చేయడమే కాకుండా… హాయిగా వైసీపీలో ఉన్నత పదువులు అనుభవిస్తూ స్వేచ్చగా తిరుగుతారా ? .. అని నూతలపాటి సోనీవుడ్ అనే ఓ వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సోనీవుడ్ ఎవరు అంటే.. సీఐడీ చీఫ్గా జగన్కు ఊడిగం చేసి.. టీడీపీ నేతల్ని తప్పుడు కేసులతో వేధించిన సునీల్ కుమార్ సమీప బంధువు. ఆయన ఫామ్ లో ఉన్నప్పుడే సోనీవుడ్కు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పదవి కూడా వచ్చింది.
ఇప్పుడు సోనీవుడ్ దళితులుపై జరుగుతున్న దమనకాండతో ఒక్క సారిగా తెరపైకి వచ్చారు. వీడియో విడుదల చేశారు. మొత్తంగా గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగైదు ఘటనల గురించి వీడియోలో చెప్పారు. హంతకులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారు.. ఒకే పార్టీకి చెందిన వారు.. అందరూ హాయిగా బయట తిరుగుతున్నారు.. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఎందుకిలా అని సోనీవుడ్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించడం అంటే ఎంతో రిస్క్ అని తెలుసని.. కుటుంసభ్యులందరితో మాట్లాడిన తర్వాతే ఈ వీడియో పెడుతున్నానని చెప్పుకొచ్చారు.
సోనీవుడ్ ఎందుకు ఇలా తిరుగుబాటు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దళితులపై జరుగుతున్న దాడులతో మానసికంగా ఆవేదన గురై ఈ వీడియో పెట్టారని తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన వారిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక సామాన్య దళితుల్లో ఎలాంటి భావన ఉంటుందో చెప్పాల్సిన పని లేదని.. వైసీపీ నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది.