తాను ఎన్ని వేషాలు వేసినా… తనకో మంచి వేషం ఇవ్వడానికి త్రివిక్రమ్ వున్నాడనే ధైరం తనలో వుందని ‘అరవింద సమేత వీరరాఘవ’ ఆడియోలో సునీల్ మాట్లాడారు. నిజమే.. సునీల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని త్రివిక్రమ్ వమ్ము చేయలేదు. స్నేహితుడి కోసం ‘అరవింద సమేత..’లో అద్భుతమైన పాత్ర రాశాడు. స్నేహితుడిలో ఆల్‌రౌండర్‌ని ఆడియన్స్‌కి మరోసారి పరిచయం చేసే విధంగా ఒక పాత్రను సృష్టించాడు. సాధారణంగా సునీల్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది వినోదమే. హీరో కంటే ముందు కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నవ్వించాడు. సునీల్ కడుపుబ్బా నవ్వించడమే కాదు.. కంటతడి కూడా పెట్టించగలడు. ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా చేస్తాడు. అందుకని, సునీల్‌లో కామెడీనీ, ఎమోషన్‌నీ త్రివిక్రమ్ బాగా వాడేశాడని టాక్.
‘అరవింద సమేత…’లో నీలాంబరి పాత్రలో సునీల్ నటించాడు. ఈ పాత్రకు ముగింపు విషాదకరమే అని తెలుస్తుంది. సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్ నీలాంబరి. ప్రారంభంలో ఎన్టీఆర్‌తో కలిసి నవ్వించిన సునీల్, విషాదకర ఘటనలో తన నటనతో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాడట! అతడి పాత్ర కథలో మలుపుగా వుంటుందని, నటుడిగా సునీల్‌కి మంచి పేరు తెస్తుందని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు.