ఎన్టీఆర్ నటనకు.. త్రివిక్రమ్ మాటలకు.. మంచి పేరొచ్చింది. ప్రేక్షకులంతా విడి విడిగా ఇద్దరి ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. కలివిడిగా మాట్లాడాల్సి వస్తే… ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాన్ని ఒక మంచి ప్రయత్నం అని అంటున్నారు. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కంప్లీట్ పాజిటివ్ టాక్ రాలేదన్నది వాస్తవం!! మొదటి రోజు మొదటి ఆట పూర్తయ్యాక… మిక్డ్స్ టాక్ వచ్చిందనేది ముమ్మాటికీ నిజం! మెజారిటీ ప్రేక్షకులు చెప్పిన మాట… త్రివిక్రమ్ శైలి వినోదం సినిమాలో లేదని! విడుదలకు ముందు ఇదే మాట త్రివిక్రమ్ కూడా చెప్పారు. రెగ్యులర్‌గా నా సినిమాల్లో వుండే వినోదం ఇందులో తక్కువగా వుంటుందని! కమర్షియల్ సాంగ్స్‌కి సినిమాలో స్కోప్ లేదని తమన్‌తో చెప్పానని కూడా ఆయన అన్నారు. కానీ, ప్రేక్షకులు వినలేదు. ‘అరవింద…’లో త్రివిక్రమ్ నుంచి ఆశించిన వినోదం తమకు దక్కలేదని కంప్లయింట్ చేశారు. దీనికి కారణం త్రివిక్రమే అని ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో సునీల్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రేక్షకులకు త్రివిక్రమ్ కామెడీని అలవాటు చేశారు కాబట్టి… అందరూ కామెడీ లేదని అంటున్నారు. ఇదే టీమ్‌తో మరో అగ్ర దర్శకుడు సినిమా చేస్తే… ఎవరూ కామెడీ లేదని కామెంట్ చేయరు. ఎవరూ అసలు మాట్లాడరు. సూపర్‌గా ఉందంటారు’’ అని సునీల్ అన్నారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాను బెంజ్ కారుతో పోల్చారు సునీల్. ఆ కారుకు ఒక ట్రాక్టర్ టైరు వేస్తే బాగోదని తన పాత్రకు త్రివిక్రమ్ కామెడీ పెట్టలేదని ఆయన అన్నారు.