కనీసం ఈసారైనా హిట్టు కొడతానా?? అంటూ దీర్ఘాలోచనలో పడిపోయాడు సునీల్. అందాల రాముడుతో హీరోగా టర్న్ అయిన సునీల్ కెరీర్ పూల బాటేం కాదు. వరుస హిట్లు ఏ రేంజుకు తీసుకెళ్లాయో… క్యూ కట్టిన ఫ్లాపులు కూడా అంతే అథఃపాతాళంలోకి తొక్కేశాయి. ఎన్నో అంచనాలు పెట్టుకొని, అతి జాగ్రత్త పడుతూ చేసిన.. కృష్ణాష్టమి కూడా సునీల్‌ని కష్టాల పాల్జేసింది. ఇక అతని ఆశలన్నీ జక్కన్నపైనే. ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఫైనల్ అవుట్ పుట్ చూసుకొన్న సునీల్‌కి క్షణక్షణానికీ టెన్షన్ పెరిగిపోతోందట. ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకొంటారో, తన భవిష్యత్తేంటో అంటూ సునీల్ తెగ ఇదైపోతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.
జక్కన్న పై సునీల్ ఫ్యూచర్ ఆధారపడి ఉందన్నది కాదనలేని వాస్తవం. ఆ సంగతి సునీల్‌కీ తెలుసు. అందుకే స్క్రిప్టు దశలోనే అన్ని జాగ్రత్తలూ తీసుకొన్నాడు. నలుగురు రైటర్లని పెట్టుకొని పంచ్‌డైలాగులు రాయించుకోవడంలో దృష్టి పెట్టాడు. మరీ యాక్షన్ అంటూ ఫైటింగుల జోలికి పోకుండా.. తన నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీ టచ్పైనా బాగా ఫోకస్ చేశాడని తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకూ జక్కన్నపై నమ్మకంగానే ఉన్న సునీల్… తాజాగా కాస్త కంగారు పడుతున్నాడని టాక్. తన సన్నిహితులకు ఈ సినిమా చూపించి కరక్షన్స్ అడుగుతున్నాడట. ఆఖరి నిమిషంలో మార్పులు చెప్పలేక.. వాళ్లూ నీళ్లు నములుతున్నారని టాక్. నిడివి విషయంలోనూ సునీల్ చాలా కేర్ చూపించాడట. సినిమా బోర్ కొట్టించకుండా రెండు గంటల లోపే ముగించేశాడని టాక్. మొత్తానికి శుక్రవారం వరకూ సునీల్ ఇలా.. టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఆ తరవాత సంగతి చేతుల్లో ఉంది.