హాస్య నటుడిగా స్టార్ హోదా అనుభవించి, హీరోగానూ అదే స్థానం కోసం పాటు పడుతున్నాడు సునీల్. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు – ఇలా ప్రారంభంలో విజయాలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు… ఫ్లాపుల బాట పట్టాడు. ఎంత కష్టపడినా విజయం దక్కడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు. మద్యలో యాక్షన్ ఇమేజ్ కోసం పరితపించినట్టు కనిపించిన సునీల్.. ఇప్పుడు మళ్లీ తన పంథాలోకే వెళ్లిపోయాడు. ఇక మీదట కామెడీ కథల్నే ఎంచుకొంటా… నా జోనర్ కాని జోలికి వెళ్లను అంటూ క్లారిటీ గా చెప్పేస్తున్నాడు. నెల రోజులుగా సునీల్ దాదాపు 25 కథలు విన్నాడట. అవన్నీ… యాక్షన్ టచ్ ఉన్న సినిమాలే. అందుకే వాటన్నింటినీ పక్కన పెట్టేశాడట.
నేనేం యాక్షన్ హీరోని కాను.. నా కథల్లో కామెడీనే ఉండాలి.. అలాంటి కథలనే ఎంచుకుంటా.. అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే మధ్యలో యాక్షన్ కథలపై మోజు ఎందుకు చూపించావు అని అడిగితే… ”నేనేం యాక్షన్ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు. నా సినిమాల్లో ఫైట్లుంటే.. దాన్ని ఓ పెద్ద హీరో సినిమాలోలానే చేయాలని పరితపించా. ఇప్పుడు కూడా యాక్షన్ సీన్ వస్తే అదే రేంజులో చేస్తా. కానీ నా బలం కామెడీ.. దాన్ని వదులుకుని పూర్తి యాక్షన్ చిత్రాలు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులోనూ దాని జోలికి వెళ్లను” అని చెప్పుకొచ్చాడు.