హాస్య నటుడి నుంచి హీరో అయ్యాక సునీల్ ఏం సాధించాడో తెలీదు గానీ.. కోల్పోయింది మాత్రం చాలా ఎక్కువ. సునీల్ కమెడియన్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. ఎంతోమంది కమెడియన్లు వచ్చినా… సునీల్ ప్లేస్ అలానే ఉండిపోయింది. హీరోగా మరొకరి ప్లేస్‌నీ సునీల్ భర్తీ చేయలేకపోయాడు. తనకంటూ ఓ మార్కెట్సృ ష్టించుకొన్నట్టేకనిపించినా, ఆ అవకాశాన్ని సునీల్ చేచేతులా వదులుకొన్నాడు. ఇప్పుడు హీరోగా సునీల్.. ‘జీరో’! కమెడియన్ గా ఉన్నప్పుడే ‘హీరో’గా వెలిగిన సునీల్.. హీరోగా మారే ప్రయత్నంలో జీరోగా మిగలడం నిజంగా విధి ఆడిన వింతాటే.
సునీల్ ఆలోచన, ఆశయం గొప్పవి కావొచ్చు. కానీ… తాను ఎంచుకొన్న దారి మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈపరాజయాలకు దర్శకుల వైఫల్యం ఎంత కారణమో, వ్యక్తిగత నిర్ణయాలూ… అంతే కారణం. సిక్స్ ప్యాక్ చేసి సునీల్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సిక్స్ ప్యాక్ విషయంలో చాలామందికి ఆదర్శంగా నిలిచాడు. కానీ ఆ సిక్స్ ప్యాకే సునీల్‌ని బాగా దెబ్బకొట్టేసింది. గుండ్రంగా ఉన్న సునీల్‌ని చూసీ, చూసీ పీలగా, మొహం లాగేసిన సునీల్ ని చూడ్డానికి కష్టపడాల్సివచ్చింది. ఓ సినిమాలో విలన్లను రఫ్ఫాడిస్తే చూడ్డానికి బాగానే ఉంటుంది. ప్రతీ సినిమాలోనూ హీరోయిజం చూపించాలన్న ప్రయత్నం చేసినప్పుడే విసుగొచ్చింది. సునీల్‌లా డాన్సులు, ఫైటింగులు చేయడానికి మనకు చాలామంది హీరోలున్నారు. సునీల్ కొత్తగా చేసేదేం లేదు. సునీల్‌లా కామెడీ చేయగలిగేవాళ్లు మాత్రం లేరు. సునీల్ నుంచి ప్రేక్షకులు కోరుకొనేది అదే. దాన్నే వదిలేశాడు సునీల్. యాక్షన్ సినిమాలు చేస్తే స్టార్ హీరోగా ఎదగొచ్చనుకొన్నాడు సునీల్. కానీ.. ‘నా సినిమాలు చూడ్డానికి వచ్చేది కామెడీ కోసమే’ అనే నిజాన్ని మర్చిపోయాడు. అదే సునీల్ కెరీర్‌కి శిరాఘాతంగా మారింది.
ఇప్పుడైనా మించిపోయింది లేదు. సునీల్ కామెడీ పాత్రలవైపు యూ టర్న్ తీసుకొంటే… అక్కడ తనకు తిరుగుండదు. ఎందుకంటే సునీల్ స్థానం ఇప్పటికీ సునీల్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. మధ్యలో కొన్ని కమెడియన్ అవకాశాలొచ్చినా హీరోయిజం వేటలో.. వాటిని పక్కన పెట్టాడు. ఇప్పుడు హీరోగా తాను ఏం చేయగలడో అర్థమైపోయింది.. అందుకే కామెడీ పాత్రల వైపు చూస్తున్నాడు. యూ టర్న్ తీసుకొని.. మళ్లీ వచ్చిన దారిలో వెళ్లడం చిన్నతనం కాదు. ఎందుకంటే.. సునీల్‌ని హీరోగా మార్చింది ఆ కామెడీ వేషాలే. కాకపోతే.. ఒకట్రెండు గొప్ప పాత్రలు పడాలి. అందుకోసం సునీల్‌కి లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ లాంటివాళ్లే పూనుకోవాలి. సైరాలో సునీల్ కూడా నటిస్తున్నట్టు వినికిడి. త్రివిక్రమ్ కొత్త సినిమాల్లోనూ సునీల్ కోసం పాత్రలు సృష్టిస్తే.. కమెడియన్‌గా మళ్లీ సునీల్ తన పూర్వవైభవం సంపాదించుకోవడం ఖాయం.