సునీల్ మంచి డాన్సర్. ఆ విషయంలో తిరిగే లేదు. అందాల రాముడులో సునీల్ డాన్సులు చూసి ముక్కున వేలేసుకొంది చిత్రసీమ. అప్పట్నుంచి డాన్సుల్లో సినిమా సినిమాకీ ఎదుగుతూనే ఉన్నాడు. కొన్నేళ్ల క్రితమే డాన్సుల్లో తన పీక్స్ చూపించేశాడు. అంతకు మించి చేసేందుకూ ఏం లేదు. కాకపోతే.. ప్రతీ సినిమాలోనూ డాన్సులపైనే దృష్టి పెట్టి, తనదైన కామెడీ టైమింగ్‌ని మిస్సయిపోతున్నాడేమో అనిపిస్తోంది. అందుకే.. సునీల్ కి విజయాలూ తగ్గుమొహం పట్టాయి. సునీల్ సినిమా వచ్చిందంటే.. కాసేపు నవ్వుకోవడానికి థియేటర్‌కి వెళ్తారు. ఈ విషయాన్ని సునీల్ గుర్తు పెట్టుకోకుండా, యాక్షనూ, డాన్సులు అంటూ కాలక్షేపం చేస్తున్నాడు. తాజాగా.. `ఉంగరాల రాంబాబు` సినిమాల్లోనూ డాన్సుల్లో రెచ్చిపోయినట్టున్నాడు. మచ్చుక్కి ఓ టీజర్ వదిలారు ఈరోజు. అందులో సునీల్ ఎప్పటిలానే (ఓ విధంగా ఇది వరకు వేసిన స్టెప్పులే) చెలరేగిపోయాడు.
క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆయనేమో కాస్త క్లాస్ టచ్ ఉన్న దర్శకుడు. సునీల్ దేమో ఊరమాస్. ఈ ఇద్దరికీ ఎలా లింకు కుదిరిందా? అంటూ టాలీవుడ్ అంతా ఎదురుచూస్తోంది. ఉంగరాల రాంబాబు.. టైటిల్ క్యాచీగానే ఉన్నా – సినిమాపై చాలా అనుమానాలున్నాయి. దానికి తోడు, ఎప్పుడో రావాల్సిన సినిమా, మధ్యలో గుట్టు చప్పుడు కాకుండా సెలైంట్ అయిపోయింది. ఇప్పుడు ఈసినిమాని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు నిర్మాతలు. అలాంటప్పుడు అందరిలా డాన్సుల టీజర్లు కాకుండా, సునీల్ శైలికి తగిన, సునీల్ నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కామెడీ పంచ్‌లతో ట్రైలర్లు వదిలితే బెటర్ అనిపిస్తోంది. లేదంటే.. ఈ సినిమాపై ప్రత్యేకంగా అటెన్షన్ పెంచడం కష్టం. ఈసారీ సునీల్ కామెడీకి కాకుండా డాన్సులకూ, మాస్ ఎలిమెంట్స్కీ పరిమితమైపోతే… సునీల్ కెరీర్‌కీ కష్టమే.