కమిడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాక సునీల్ కెరీర్ కాస్త గాడిలిలో పడినట్టే కనిపిస్తోంది. అరవింద సమేత వీర రాఘవతో సునీల్ ఖాతాలో ఓ మంచి పాత్ర, ఓ మంచి హిట్టు పడినట్టైంది. ఇప్పుడు `చిత్రలహరి`తో కూడా ఆకట్టుకుంటున్నాడు. తేజూకి ‘గ్లాస్ మేట్’గా కనిపించి.. మంచి మార్కులు అందుకున్నాడు. సునీల్ చేతిలో మరో మూడు పెద్ద సినిమాలు పడ్డాయి. తన మిత్రుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలో సునీల్‌కి ఓ పాత్ర దక్కింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రవితేజ డిస్కో రాజాలో కూడా సునీల్ నటిస్తున్నాడు. చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలోనూ సునీల్‌కి ఛాన్స్ దొరికినట్టు సమాచారం. ఈ విషయాన్ని సునీల్ పరోక్షంగా ప్రస్తావించాడు కూడా. ”నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కల తీరబోతోంది. త్వరలో ఓ పెద్ద సినిమాలో, ఓ పెద్ద హీరోతో కలసి నటించబోతున్నా. ఆ హీరో ఎవరన్నది మీ ఊహకే వదిలేస్తున్నా” అంటూ హింట్ ఇచ్చాడు సునీల్.
చిరంజీవి 150వ చిత్రంలో సునీల్‌కి ఛాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు కాలేక ఆ సినిమాని వదులుకున్నాడు. ఇప్పుడు మాత్రం సునీల్ మెగా ఛాన్స్‌ని వదులుకునే స్థితిలో లేడు. అయితే హీరోగా మాత్రం సునీల్ కెరీర్‌కి పుల్ స్టాప్ పడినట్టే. ఈ విషయాన్ని సునీల్ స్వయంగా చెప్పాడు. ”కథానాయకుడిగా చేయాల్సిన సినిమాలు రెండున్నాయి. ఎందుకంటే ఆ సినిమాలకు సంబంధించి ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చుకున్నాను. ఆ సినిమాల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాది. అవి మినహాయిస్తే.. హీరోగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోదలచుకోలేదు” అని క్లారిటీ ఇచ్చేశాడు.