వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు తొలి అరెస్ట్ చూపించారు. సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసి.. అక్కడి కోర్టు నుంచి ట్రాన్సిట్ పర్మిట్ ద్వారా కడపకు తీసుకువచ్చారు. సునీల్ కుమార్ వైఎస్ వివేకాకు సన్నిహితుడిగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తానని ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా నెల రోజుల పాటు ప్రతీ రోజు సునీల్ యాదవ్‌ను ప్రశ్నించారు. తర్వాత వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలంలోనూ సునీల్ యాదవ్ పేరు ఉందన్న ప్రచారం జరిగింది.
ఆ తర్వాత సునీల్ కుమార్.. తనపై విచారణ పేరుతో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని హైకోర్టును ఆశ్రయించారు. తమను విచారిస్తే మెజిస్ట్రేట్ ఎదుట విచారించాలని కోరారు. అయితే నిబంధనల మేరకే విచారిస్తున్నామని సీబీఐ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ తర్వాత సునీల్ యాదవ్ కుటుంబం పులివెందులలోని తన నివాసానికి తాళం వేసి వెళ్లిపోయారు. అప్పట్నుంచి సునీల్ యాదవ్ పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్న సీబీఐ… చివరికి గోవాలో వెతికి పట్టుకుంది. బుధవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసును సునీల్ కుమార్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబం చుట్టూ తిప్పుతున్నారు.
వివేకా హత్య కేసును ప్రణాళికా బద్దంగా తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. బాబాయిని ఎవరు హత్య చేశారో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసని.. ఎమ్మెల్సీ రవీంధ్రనాధ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అసలు నిందితుల్ని తప్పించేందుకే కుట్ర ప్రకారం అంతా చేస్తున్నారని అంటున్నారు. మెజిస్ట్రేట్‌కు మాత్రమే ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలం బయటకు రావడం.. సునీల్ కుమార్ టార్గెట్‌గా విచారణ జరుగుతూండటంతో వివేకాకేసులో ఏం జరగబోతోందన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది.